Kendriya Vidyalaya : కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల

అధునాతన, సాంకేతిక విద్యా బోధనకు వేదికలైన కేంద్రియ విద్యాలయాల్లో (కేవి) ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ ఏడాది ప్రక్రియ కొంత ఆలస్యమైంది.

notification for admission in Kendriya Vidyalayas : అధునాతన, సాంకేతిక విద్యా బోధనకు వేదికలైన కేంద్రియ విద్యాలయాల్లో (కేవి) ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ ఏడాది ప్రక్రియ కొంత ఆలస్యమైంది. 2021-22 విద్యా సంవత్సరానికి వచ్చే నెల 1 నుంచి మే 31వ తేదీకి ఇంటర్మీడియట్‌ మినహాయించి మిగిలిన అన్ని తరగతుల్లో ప్రవేశాలు పూర్తి చేసేందుకు ఆదివారం కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఒకటో తరగతిలో చేరితే ఇంటర్మీడియట్‌ వరకు చదువుకోవచ్చు. దీంతో సీట్లు పొందేందుకు ఏటా విపరీతమైన పోటీ ఉంటుంది. ఖాళీలు పదుల సంఖ్యలో ఉంటే దరఖాస్తులు వందలు, వేలల్లో వస్తున్నాయి.

దరఖాస్తు గడువు..
ఒకటో తరగతిలో ప్రవేశాలకు వచ్చే నెల 1వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమై 19వ తేదీ సాయంత్రం 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం ఉంది. రెండో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీలను వచ్చే నెల 8వ తేదీ నుంచి 15వ తేదీలోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు వెల్లడైన 30 రోజుల్లోపు ఇంటర్మీడియెట్‌లో ఖాళీలను భర్తీ చేస్తారు.

వయో పరిమితి…
ఒకటో తరగతిలో ప్రవేశానికి 2021 మార్చి 31వ తేదీకి ఐదేళ్లు నిండి ఉండాలి. ఐదు నుంచి ఏడేళ్లలోపు వారికి మాత్రమే ఒకటో తరగతిలో ప్రవేశం ఉంటుంది.

సీట్ల భర్తీ ఇలా..
ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో తరగతికి 40 చొప్పున సీట్లు ఉంటాయి. ఒకటో తరగతిలో 40 సీట్లను భర్తీ చేస్తారు. సెక్షన్‌కు 40 సీట్లు ఉంటాయి. నల్లపాడు కేవీలో రెండు సెక్షన్లు ఉండడంతో అక్కడ 80 మందికి ప్రవేశ అవకాశం ఉంటుంది.

నాలుగు ప్రాధాన్యాలు..
ప్రవేశాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ రంగంలో పనిచేసేవారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. కేంద్ర అనుబంధ సంస్థలు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగులు, ఒకే సంతానం కలిగిన కుటుంబాల్లోని వారికి ప్రాధాన్యం ఉంటుంది. పార్లమెంట్‌ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, కేంద్ర మావన వనరుల మంత్రిత్వశాఖ, కేవీఎస్‌ ఉన్నతాధికారులు సిఫార్సు చేసిన విద్యార్థులకు ప్రవేశాల్లో ప్రాధాన్యత ఉంటుంది. సామాన్యులకు చోటు దక్కితే అదృష్టమే అవుతుంది.

ఆర్‌టీఈలో సీటు దక్కితే ఉచితమే..
15 శాతం సీట్లను ఎస్సీలకు.. 7.5 శాతం సీట్లను ఎస్టీలకు, 3 శాతం సీట్లు దివ్యాంగులకు రిజర్వు అవుతాయి. మిగిలిన సీట్లు ఇతరులకు కేటాయిస్తారు. జాతీయ విద్యాహక్కు చట్టం(ఆర్‌టీఈ) నిబంధనల మేరకు ప్రతి తరగతిలో 10 సీట్లను ఉచిత బోధనా పద్ధతిలో భర్తీ చేస్తారు. ఆన్‌లైన్‌లో లాటరీ ద్వారా వీరి ఎంపిక ఉంటుంది. ఒకటో తరగతిలో ఆర్‌టీఈ కింద ప్రవేశం పొందితే పాఠశాల చదువు పూర్తయ్యే వరకు ఉచిత బోధన లభిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు.. ఆర్‌టీఈ కింద సీట్లు భర్తీ అయ్యే వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు..
ఒకటో తరగతికి విద్యార్థి జనన ధ్రువీకరణ పత్రం, ఫొటో, ఆధార్‌ వివరాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. https: //kvsonlineadmission.kvs.gov.in వెబ్‌సైట్‌తోపాటు కేవీఎస్‌ రూపొందించిన ఆండ్రాయిడ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 1వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ దృష్ట్యా ముందుగానే ధ్రువపత్రాల్ని విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధం చేసుకోవాల్సిన అవసరముంది. రెండు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీలకు కేంద్రీయ విద్యాలయాల్లో నేరుగా సంప్రదించాల్సి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు