రాజకీయాల్లో పట్టు కోల్పోతే అసహనం పెరిగిపోతుందనడానికి రేణుకా చౌదరి ప్రత్యక్ష ఉదాహరణగా చూపిస్తున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం రేణుకా చౌదరికి ఖమ్మం జిల్లాపై పట్టు సడలింది. గతంలో కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి విధేయురాలిగా ఉన్నారామె. అలాంటి నాయకురాలు ఇప్పుడు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీకి వ్యతిరేకంగా వ్యవహరించేలా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయింది.
తెలంగాణలో ఏ నేతా.. చేయని పని చేయడమే ఇప్పుడు పార్టీలో కుదుపునకు కారణమైంది. కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలు రాసిన లేఖపై రేణుకాచౌదరి కూడా సంతకం చేశారు. ఈ విషయం బయటకు రావడంతో ఏఐసీసీలోనే కాదు.. తెలంగాణ కాంగ్రెస్‌లోనూ కలకలం రేగింది. గాంధీ, నెహ్రూ కుటుంబాలకు అంత విధేయురాలిగా వ్యవహరించిన రేణుక ఒక్కసారిగా ఎందుకు ఇలా రివర్సయ్యారనే చర్చ మొదలైంది.
నిజానికి ఈ వ్యతిరేకత ఇప్పటికిప్పుడు వచ్చినది కాదనే టాక్ వినిపిస్తోంది. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడైన తర్వాత కొంత కాలం రాహుల్‌కు సన్నిహితంగా ఉంటూ గులాం నబీ ఆజాద్ ద్వారా టీపీసీసీ అధ్యక్షురాలి పదవి కోసం విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారు.
ఆ తర్వాత రాజ్యసభకు అవకాశం దక్కుతుందని భావించారు రేణుకా చౌదరి. ఏ పార్టీలోఉన్నా ఫైర్ బ్రాండ్‌గా ముద్రపడ్డారు రేణుక. రాజ్యసభకు అవకాశం కల్పించే విషయంలో రాహుల్ అడ్డు చెప్పారనే టాక్ వినిపించింది. ఇది మనసులో పెట్టుకున్నారట రేణుక. అంతే కాదు.. ఏఐసీసీ నుంచి కూడా రేణుకను తప్పించారు. అప్పటి నుంచి ఆమె.. గాంధీ కుటుంబానికి దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.
https://10tv.in/japans-pm-shinzo-abe-announces-resignation/
ఇప్పుడు పార్టీలోని సీనియర్లతో జత కట్టి, వారు రాసిన లేఖపై సంతకం కూడా చేశారు. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ దగ్గర మంచి పలుకుబడి ఉన్న నాయకురాలిగా గుర్తింపు పొందిన రేణుక.. 1999, 2004లో ఖమ్మం నుంచి వరుసగా లోక్‌సభకు ఎంపికయ్యారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత సోనియాను మచ్చిక చేసుకుని రాజ్యసభకు కూడా ఎంపికయ్యారు.
రాష్ట్ర విభజన తర్వాత.. కాంగ్రెస్ పుంజుకుంటుందని భావించారు. కానీ, పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. 2018 తెలంగాణ ఎన్నికల సమయంలో టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని రేణుకా చౌదరి వ్యతిరేకించారు. రాహుల్ నిర్ణయానికి కట్టుబడడం తప్ప తన ముందు గత్యంతరం లేదని అప్పట్లోనే వెల్లడించి సంచలనం సృష్టించారు. ఆ ఎన్నికల్లో అయిష్టంగానే ప్రచారం చేశారు.
ఎన్నికల్లో ఓడిన తర్వాత జనపథ్‌కు ఎంట్రీ లేకుండా పోవడం… రాష్ట్రంలో కూడా చురుకుగా ఉండడం లేదు. అటు పార్టీ అధిష్టానంతో కూడా సాన్నిహిత్యం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే సీనియర్లతో చేతులు కలిపి సోనియాకు వ్యతిరేకంగా రాసిన లేఖపై సంతకం చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. పార్టీ పరంగా వివిధ పదవులు అనుభవించిన రేణుక లాంటి వారు ఇలా చేయడం ఏంటంటూ నిలదీస్తున్నారు.
ఆమె మాత్రం అవేవీ పట్టించుకోవడం లేదంటున్నారు. తనకు అనిపించింది చేయడం మొదటి నుంచి అలవాటేనని చెబుతున్నారు. ఆ రోజు తనకు రాజ్యసభ పదవి రాకుండా రాహుల్ అడ్డుకున్నందునే ఈ రోజు ఇలా వ్యవహరించారని గుసగుసలాడుకుంటున్నారు.