Nara Devansh : లండన్‌లో అవార్డు అందుకున్న నారా దేవాన్ష్
Nara Devansh: సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ లండన్‌లో అవార్డు అందుకున్నాడు.

Nara Devansh
Nara Devansh: సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ లండన్‌లో అవార్డు అందుకున్నారు. వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ -2025 వేడుకలో నిర్వాహకులు దేవాన్ష్‌కు అవార్డును అందజేశారు. ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంకు మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మిణిలు హాజరయ్యారు.
గతేడాది డిసెంబర్ నెలలో నారా దేవాన్ష్ చదరంగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించడం ద్వారా కేవలం తొమ్మిదేళ్ల వయస్సులోనే ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్-175 పజిల్స్ రికార్డును సొంతం చేసుకున్నాడు. దీంతోపాటు దేవాన్ష్ సాధించిన మరో రెండు రికార్డులను ప్రతిష్టాత్మక ‘వరల్డ్ బుక్ఆఫ్ రికార్డ్స్ – లండన్’ అధికారికంగా ధ్రువీకరించింది.
వ్యూహాత్మకమైన ఆటతీరుతో 11 నిమిషాల 59 సెకన్లలో చెక్‌మేట్ పజిల్స్ పూర్తి చేసిన దేవాంశ్.. ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అయితే, తాజాగా.. లండన్‌లో జరిగిన కార్యక్రమంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకుల చేతుల మీదుగా దేవాన్ష్ అవార్డు అందుకున్నారు.
దేవాన్ష్ సాధించిన ఈ ఘనత ఎంతో గర్వకారణంగా ఉందని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. 10ఏళ్ల వయస్సులోనే ఆలోచనలకు పదును పెడుతూ.. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉంటూ అంకిత భావంతో చెస్ నేర్చుకున్నాడని, దేవాన్ష్ కష్టాన్ని, గంటల తరబడి కఠోర శ్రమను తండ్రిగా ప్రత్యక్షంగా చూశానని నారా లోకేశ్ అన్నారు. కష్టానికి తగ్గ ఫలితం చూసి ఎంతో ఆనందిస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.