Nampally Fire Accident Representative Image (Image Credit To Original Source)
Nampally Fire Accident: హైదరాబాద్ నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భవనంలో చిక్కుకుపోయిన ఐదుగురిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. లోపల చిక్కుకున్న వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. భవనంలోకి వెళ్లేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నిస్తోంది. రెండు జేసీబీలతో భవనం సెల్లార్ కూల్చివేశారు. దట్టమైన పొగతో రెస్క్యూ ఆపరేషన్ కు తీవ్రమైన ఆటంకం కలుగుతోంది. ఘటన జరిగిన ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
నాంపల్లిలోని ఓ ఫర్నీచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అది నాలుగు అంతస్తుల భవనం. అందులో బాచా క్యాజిల్ ఫర్నీచర్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగి నాలుగో అంతస్తు వరకు వ్యాపించాయి. దుకాణంలోని సెల్లార్‌లో పెద్ద ఎత్తున ఫర్నిచర్ నిల్వ ఉంచారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మంటలు భారీగా చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
భవనం లోపల ఐదుగురు చిక్కుకున్నట్లు గుర్తించారు. వారిలో ఇద్దరు చిన్నారులు (అఖిల్, ప్రణీత్) ఉన్నారు. మిగతా ముగ్గురిని హబీబ్, ఇంతియాజ్, బీబీలుగా గుర్తించారు. స్కైలాడర్ ద్వారా నాలుగో అంతస్తు అద్దాలను పగులగొట్టి వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందు జాగ్రత్తగా అధికారులు ఆ భవనం పరిసర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు.