BC Reservations: రాజ్‌భవన్‎కు చేరిన బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్.. గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు సమీపిస్తున్నందున ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Telangana Raj Bhavan

BC Reservations: తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా రాజ్ భవన్ కు చేరింది. పంచాయతీ రాజ్ చట్టంలో సవరణల ఆమోదం కోసం గవర్నర్ కు పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285 (A) సవరించాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆ సెక్షన్ లో స్థానిక సంస్థల్లో 50శాతానికి మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయని ఉంది. అందులో 50శాతానికి మించకుండా అనే వ్యాఖ్యాన్ని తొలగిస్తూ సవరించాలని నిర్ణయించారు.

ఇక పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు సమీపిస్తున్నందున ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీ రాజ్ శాఖ ఫైల్ ను న్యాయశాఖ ఆమోదించిన తర్వాత ప్రభుత్వం రాజ్ భవన్ కు ముసాయిదాగా పంపించింది. గవర్నర్ ఆమోదం పొందితే చట్ట సవరణ అమల్లోకి రానుంది. దీనికి అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లను సిఫారసు చేయనుంది.

Also Read: అక్కడ ఉండలేం సరే.. కారు దిగేద్దామా? కవిత డైలమా..! ఫ్యూచర్ పాలిటిక్స్‌పై ఓ క్లారిటీకి వచ్చారా?

వాటి ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించనుంది. పంచాయతీ ఎన్నికలను సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాలని గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు గడువు విధించిన సంగతి తెలిసిందే.