ఆవేదన ఆమెది. ఆమె ఆగ్రహంతో జరిగిన నష్టం పార్టీకి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఎక్కడ చూసినా కొండా సురేఖ కామెంట్స్ మీదే చర్చ జరుగుతోంది. తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదనతో..బీఆర్ఎఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టార్గెట్ చేసే క్రమంలో నాగార్జున కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగారు కొండా సురేఖ.
ఆమె కామెంట్స్‌ను చూసిన ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు సొంత పార్టీ నేతలు, మిగతా మంత్రులు కూడా షాకయ్యారు. ఆధారాలు లేని ఆరోపణలతో పాటు సెన్సిటివ్ ఇష్యూలో, రాజకీయాలకు సంబంధం లేని నాగార్జున కుటుంబాన్ని..ఓ మహిళా మంత్రి అయి ఉండి మరో మహిళా నటిని వివాదంలోకి లాగడం పెద్ద కాంట్రవర్సీకి కారణమైంది.
మంత్రి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీ మీద చేసిన ఆరోపణలపై ఎవ్వరూ ఉహించని వ్యతిరేకత వ్యక్తమైంది. సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే మూకుమ్మడిగా కొండా సురేఖపై దాడి చేశారు. అంతే కాకుండా పలుపార్టీలకు చెందిన నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబట్టారు.
అధిష్ఠానం ఆదేశించడంతోనే?
కాంగ్రెస్ అధిష్టానం కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను అంతర్గతంగా తప్పుబట్టిందని గాంధీభవన్ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే నాగార్జున కుటుంబంపై ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించడంతో ఎట్టకేలకు తాను చేసిన కామెంట్స్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు కొండా సురేఖ. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది.
వివాదం అంతటితో ముగుస్తుందనుకున్న సమయంలో నాగచైతన్య, సమంత విడాకుల మరోసారి కొండా సురేఖ మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. దీంతో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలన్నింటిపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారని తెలుస్తోంది. ప్రజాపాలన పేరుతో విప్లవాత్మకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తున్న క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయని సీఎం రేవంత్ అభిప్రాయపడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రజల్లో చులకనైపోతామని హెచ్చరిక?
ఇప్పటికే హైడ్రా, మూసీ ప్రక్షాళన అంశాలతో ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్న సమయంలో కొండా సురేఖ తొందరపాటు వ్యాఖ్యలు..మరో తలనొప్పిని తీసుకొచ్చాయని..సీఎం రేవంత్ పార్టీ నేతల దగ్గర వాపోయారని టాక్. అందుకే ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ప్రత్యర్థి పార్టీలపై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. లేదంటే ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు రావడంతో పాటు ప్రజల్లో చులకనైపోతామని హెచ్చరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే బీఆర్ఎస్ విమర్శల దాడితో అధికార కాంగ్రెస్ కాస్త గందరగోళంలో ఉంది. రైతు రుణమాఫీ, మూవీ ప్రక్షాళన, రైతు భరోసా..ఇలా అంశమేదైనా అపోజిషన్ కాంగ్రెస్‌ను కార్నర్ చేస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ డైలాగ్ వార్ నడుస్తున్న సమయంలో కొండా సురేఖ చేసిన కామెంట్స్ తీవ్ర ప్రకంపనలకు దారి తీసింది. ఇప్పటికే బీఆర్ఎస్‌ను తిప్పికొట్టడంలో వెనకబడిపోయామన్న భావనలో ఉన్న కాంగ్రెస్..కొండా సురేఖ కామెంట్స్‌తో మరింత తమ గ్రాఫ్ పడిపోతుందని భావిస్తోందట.
TTD laddu Row: సుప్రీంకోర్టు తీర్పు ఎవరు కోరుకున్నట్లు వచ్చినట్లు?