TTD laddu Row: సుప్రీంకోర్టు తీర్పు ఎవరు కోరుకున్నట్లు వచ్చినట్లు?

నెయ్యి కల్తీ అయిందని లోకల్ సిట్‌ చెప్తే చంద్రబాబు చెప్పుచేతల్లోని టీమ్ వాళ్లకు అనుకూలంగా రిపోర్ట్‌ ఇచ్చిందని విమర్శలు వచ్చేవి.

TTD laddu Row: సుప్రీంకోర్టు తీర్పు ఎవరు కోరుకున్నట్లు వచ్చినట్లు?

Updated On : October 4, 2024 / 8:39 PM IST

కొండ మీది వ్యవహారం ఏడు కొండల మీదే ముగుస్తుందనుకున్నారు. కానీ మాడవీధులు దాటి..ఏపీలో రాజకీయ దుమారం లేపి..దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంతింతై పెద్ద ఇష్యూ అయింది శ్రీవారి లడ్డూ వివాదం. స్వామివారి ప్రసాదం అపవిత్రం అయిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో మొదలైన దుమారం దేశవ్యాప్తంగా హిందువుల ఆగ్రహానికి కారణమైంది. ఏపీ సర్కార్ సిట్‌ వేసింది. కానీ పంచాయతీ తేగేలా కనిపించలేదు. అంతలోనే వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి లాంటి వారు సుప్రీంకోర్టు మెట్లెక్కడంతో..స్పెషల్ టీమ్‌తో దర్యాప్తు జరగాలంటోంది సుప్రీంకోర్టు.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న ఇష్యూపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిలో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీసు అధికారులు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సంస్థ నుంచి ఒక సీనియర్‌ అధికారి సభ్యులుగా ఉండాలని సూచించింది. స్వతంత్ర సిట్‌ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షిస్తారని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది.

పూర్తిగా సీబీఐ పరిధిలో లేకుండా..
అయితే సుప్రీం తీర్పు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైసీపీ సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేసింది. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాత్రం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ పిటిషన్ వేశారు. అటు పూర్తిస్థాయిలో సీబీఐ ఎంక్వైరీ కాకుండా.. ఇటు మాజీ న్యాయమూర్తితో కాకుండా.. స్పెషల్ సిట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. పూర్తిగా సీబీఐ పరిధిలో లేకుండా.. అలా అని ఏపీ ప్రభుత్వ పరిధిలో లేకుండా..సీబీఐ నుంచి ఇద్దరు..ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీసు అధికారులు ఉండేలా ఆర్డర్స్ ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం.

సుప్రీం ఇచ్చిన తీర్పును సీఎం చంద్రబాబుతో పాటు వైసీపీ నేతలు కూడా స్వాగతిస్తున్నారు. సత్యమేవ జయతే అని చంద్రబాబు అంటుంటే..సుప్రీం ఆర్డర్స్ చంద్రబాబుకు చెంప పెట్టులాంటివని..న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు మాజీ సీఎం జగన్‌తో పాటు భూమన, వైవీ సుబ్బారెడ్డి స్టేట్‌మెంట్లు ఇచ్చారు. అయితే సుప్రీం తీర్పు..ఎవరు ఆశించినట్లు వచ్చిందన్న చర్చ జరుగుతోంది. ఇదో రకంగా చంద్రబాబుకు అనుకూలంగా వచ్చినట్లు భావించాలంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ఏదో ఒక కేంద్ర పరిధిలోని సంస్థతో ఎంక్వైరీ జరగాలని చంద్రబాబు కోరుకున్నారని..ఇప్పుడదే జరగబోతుందని విశ్లేషిస్తున్నారు.

లడ్డూ వివాదంపై డైలాగ్ వార్ కొనసాగుతుండగానే సిట్‌ ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. అయితే సీబీఐ విచారణకు కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఈ పరిస్థితుల్లో కూటమి కార్నర్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇంతలోనే సుప్రీంలో పిటిషన్లు దాఖలు అవడం..విచారణ కొనసాగుతుండటంతో సిట్ విచారణను నిలిపివేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు కోర్టు తీర్పుతో ఓ ప్రత్యేక టీమ్‌ దర్యాప్తు చేయనుంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉండాలన్న సుప్రీం ఆదేశాలతో స్పెషల్ సిట్‌ అనేది ఓ న్యూట్రల్‌ టీమ్‌గా విశ్లేషించబడుతోంది.

ఈ రెండు విమర్శలకు చెక్‌?
ఏపీ సర్కార్ వేసిన సిట్‌ నెయ్యి కల్తీ జరిగిందని తేల్చినా.. కల్తీ జరగలేదని తేల్చినా సీఎం చంద్రబాబే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేది. నెయ్యి కల్తీ అయిందని లోకల్ సిట్‌ చెప్తే చంద్రబాబు చెప్పుచేతల్లోని టీమ్ వాళ్లకు అనుకూలంగా రిపోర్ట్‌ ఇచ్చిందని విమర్శలు వచ్చేవి.

కల్తీ జరగలేదని తేల్చినా కూటమి సర్కార్ వేసినా సిట్టే కల్తీని నిర్ధారించలేదని.. చంద్రబాబు రాజకీయ దురుద్దేశంతో రాద్దాంతం చేశారన్న ఆరోపణలు ఎదురుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ రెండు విమర్శలకు చెక్‌ పెట్టినట్లు అయిందంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. అంతేకాదు వైసీపీ కూడా సుప్రీం చెప్పిన ప్రత్యేక సిట్‌ ఏర్పాటును స్వాగతిస్తుండటంతో..స్పెషల్ సిట్‌ ఇచ్చే రిపోర్టును కూడా ఒప్పుకోక తప్పదంటున్నారు.

సో ఇప్పుడు ప్రత్యేక సిట్‌ చేతిలో ఏపీ రాజకీయం ఇరుక్కుపోబోతుంది. స్పెషల్ సిట్‌ తేల్చే వరకు లడ్డూ లడాయిపై పార్టీలు సైలెంట్‌గా ఉండే అవకాశం కనిపిస్తోంది. సేమ్‌టైమ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌లో పనిచేస్తున్న ఇద్దరు పోలీసు అధికారులను స్పెషల్‌ సిట్‌లో నియమించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.

ఆ అధికారులు ఇప్పటికే తమ మూడు రోజుల విచారణలో సేకరించిన అంశాలను సీబీఐ ఆఫీసర్లతో పాటు FSSAI ఆఫీసర్ ముందు పెట్టనున్నారు. ఫైనల్‌గా ఇప్పుడు సుప్రీం వేసిన స్పెషల్‌ సిట్‌ ఇచ్చే రిపోర్టే లడ్డూ కల్తీ వ్యవహారాన్ని తేల్చడంతో పాటు..ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మారే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.

భారీ ఎన్‌కౌంటర్‌.. 30 మంది మావోయిస్టుల మృతి