×
Ad

కొత్త సంవత్సరంలో జనంలోకి వెళ్లాలనుకుంటున్న కేసీఆర్.. గులాబీ బాస్‌ను అడ్డుకునేలా రేవంత్‌ స్కెచ్?

కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్‌కు.. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసుతో బ్రేకులు వేయబోతున్నారన్న చర్చ సాగుతోంది.

Revanth Reddy: ఇప్పటిదాక ఒక లెక్క. ఇక నుంచి మరో లెక్క. అడ్డగోలుగా మాట్లాడుతాం.. నోటికొచ్చినట్లు వాగుతాం.. అంటే కుదరదు. ప్రజాక్షేత్రంలోకి లాగుతాం. మీ సంగంతేంటో చూస్తామని..కాంగ్రెస్‌ సర్కార్‌కు వార్నింగ్‌ ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ సర్కార్‌కు కావాల్సిన టైమ్‌ ఇచ్చామని..ఇక పోరు బాటే అంటూ యుద్ధం ప్రకటించారు. దాదాపు రెండేళ్ల పాటు ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కే పరిమితమైన గులాబీ బాస్ ఇకపై ఫుల్‌ యాక్టీవ్‌గా పాలిటిక్స్‌లో ఉంటానని చెప్పుకొచ్చారు.

రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు సంసిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్‌ను ఎంచుకున్నారు కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, కృష్ణా జలాలను ఏపీకి తరలించే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్న కేసీఆర్..ఆందోళనలు, సభలు, సమావేశాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

కాంగ్రెస్ పాలన తెలంగాణకు శాపంగా మారిందని కేసీఆర్ శాపనార్థాలు పెట్టడం, హస్తం పార్టీ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించి ఇకపై ప్రజల్లోకి వెళ్తామని యుద్ధం ప్రకటించడంతో రాజకీయం వేడెక్కింది. రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్‌లో కేసీఆర్ రాక ఉత్సాహాన్ని నింపింది. ఇక పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆశించిన దాని కంటే మెరుగైన ఫలితాలు రావడంతో..ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇంకా సత్తా చాటొచ్చన్న నమ్మకం పెరిగింది.

Also Read: ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌కు రిస్క్.. చంద్రబాబుకు సవాళ్లు?

కేసీఆర్ చేసిన కామెంట్స్‌ అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం మధ్య డైలాగ్‌వార్‌కు దారితీశాయి. బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ చరిత్ర ఇక ముగిసిన కథే అంటున్నారు సీఎం రేవంత్‌. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్‌ కుటుంబం అధికారంలోకి రాదని, రానివ్వబోనని కొడంగల్‌ సాక్షిగా శపథం చేశారు. 2029 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 80 సీట్లు, 153 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 100కుపైగా సీట్లు గెలుచుకుంటాం..ఇది తన సవాల్‌ రాసిపెట్టుకోండి అంటూ గర్జించారు రేవంత్.

గులాబీ పార్టీ నేతల దూకుడుకు బ్రేకులు వేసేలా స్కెచ్
అందుకు అనుగుణంగానే కేసీఆర్‌తో పాటు గులాబీ పార్టీ నేతల దూకుడుకు బ్రేకులు వేసేలా పథకం రచిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పాలనలో స్కామ్‌లు జరిగాయంటూ కేసులు, విచారణలను స్పీడప్ చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ ఆఫీసర్లు కేసీఆర్ సహా కేటీఆర్, హరీశ్‌రావులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల తర్వాత జనంలోకి వచ్చేందుకు రెడీ అవుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్‌కు.. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసుతో బ్రేకులు వేయబోతున్నారన్న చర్చ సాగుతోంది. అంతే కాకుండా ఈ నెల 29 నుంచి ప్రారంభవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో నదీజలాలు, ప్రాజెక్టుల అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కృష్ణా జలాలపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీతో కుదుర్చుకున్న ఒప్పందం తెలంగాణకు శాపంగా మారిందని చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్, ఫార్ములా ఈ కారు రేస్‌ వంటి అంశాలను సభలో ప్రస్తావనకు తెచ్చేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోందట.

అయితే కేసీఆర్‌కు నోటీసులు కొత్త కాదని, కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోవడంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరై డీటేయిల్డ్‌గా సమాధానం ఇచ్చిన విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇస్తే ఆయన విచారణకు హాజరవుతారా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదంటున్నాయి పార్టీ వర్గాలు. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండుసార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు.

కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో అరెస్ట్ తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్య అన్నది కారు పార్టీ నేతల వాదన. కేసులు విచారణలు తమను చికాకు పెడుతున్నాయన్న అసహనం బీఆర్ఎస్‌ వర్గాల్లో కనిపిస్తోంది. కొత్త సంవత్సరంలో ప్రజల్లోకి వెళ్లాలనుకున్న గులాబీ దళపతి కేసీఆర్ దూకుడుకు..బ్రేకులు వేసేందుకు రేవంత్ పక్కా స్కెచ్ రెడీ చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్‌ గేమ్‌కు కేసీఆర్ దగ్గరున్న ప్లాన్‌ ఏంటో చూడాలి మరి.