Rythu Bharosa: రైతు భరోసా అమలుకు తెలంగాణ సర్కారు ద్విముఖ వ్యూహం!

దీని వల్ల.. ఇచ్చిన హామీలు నెరవేరడంతో పాటు పార్లమెంట్‌ ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగా మారుతుందని భావిస్తోంది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.

Rythu Bharosa: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ఇందులో భాగంగా రైతు భరోసా అమలు విషయంలో ద్విముఖ వ్యూహాన్ని అనుసరించే ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. రైతు భరోసా పెంపు భారం ప్రభుత్వంపై పడకుండా చూస్తూనే.. సాగు భూములకు మాత్రమే పథకం వర్తించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ల్యాండ్‌ సీలింగ్‌ విధానాన్ని అమలు చేసే వ్యూహం రచిస్తోంది.

ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన రైతు భరోసాపై దృష్టి సారించింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రంలో కోటి 52 లక్షల ఎక‌రాల‌కు రైతుబంధు పథకం అమలవుతుండగా.. 68 లక్షల 99 వేల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. గత సర్కారు ఎకరాకు 5 వేల రూపాయల చొప్పున రెండు పంటలకు రైతుబంధు అందజేసింది. అయితే.. రెండు పంటలకు కలిపి 15 వేల రూపాయలు అందజేసేందుకు ప్రణాళిక రూపొందించిన కాంగ్రెస్‌ సర్కారు.. ఇందులో భాగంగా ల్యాండ్‌ సీలింగ్‌ను తెరమీదకు తీసుకువస్తోంది.

కొండలు, గుట్టలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు రైతు భరోసాను కట్‌ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. పథకం విధివిధానాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ స్కీం కింద లబ్ధిదారుల ఎంపికపై మార్గదర్శకాలు తయారు చేస్తున్న సర్కారు.. 5 ఎకరాల వరకు సీలింగ్‌ పెడితే ఎలా ఉంటుందన్న దానిపై లెక్కలు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న లబ్ధిదారుల్లో ఎవరికి ఎంత భూమి ఉంది ? రైతు భరోసా అందుకునే వారిలో అన్నదాతలు కాకుండా ఎవరెవరు ఉన్నారు ? అనే అంశాలపై ఇప్పటికే వివరాలు సేకరించినట్లు సమాచారం.

చెక్‌ పెట్టాలని..
ప్రస్తుతం ఉన్న లబ్ధిదారుల్లో చిన్న, సన్నకారు రైతులు 90 శాతం ఉంటే.. 10 శాతం బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు, బడా వ్యాపార వేత్తలు, రియల్టర్లు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. దీనికితోడు కొండలు, గుట్టలు, పడావు పడ్డ భూములకు సైతం పలువురు లీడర్లు, బ్యూరోక్రాట్లు రైతుబంధు మొత్తం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

Also Read: 10 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ రెడీ? ఎంపీ అభ్యర్థులు వీళ్లే?

దీనికి చెక్‌ పెట్టాలని భావించిన సర్కారు… ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ను వినియోగించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇలా సర్వే చేయడం ద్వారా రాష్ట్రంలో సాగు భూముల లెక్క తేల్చనుంది. తద్వారా నిజంగా సాగుచేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా అందించాలని భావిస్తోంది.

లబ్ధి పొందే రైతులు ఎంత మంది?
ఇలా ఐదెకరాల సీలింగ్‌ను అమలు చేస్తే.. రాష్ట్రంలో లబ్ధి పొందే రైతులు 62 లక్షల 34 వేల మంది ఉంటారని లెక్క తేలినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఇప్పుడు ఏడాదికి ఖర్చు చేస్తున్న 15 వేల కోట్ల రూపాయల్లో సగం వరకు తగ్గే అవకాశముదని సమాచారం. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి ఈ నిధులు మిగలడం వల్ల.. పెంచిన మొత్తాన్ని దానికి సర్దుబాటు చేసే అవకాశముంటుందని భావిస్తోంది.

ఇటు ప్రభుత్వంపై భారం పడకుండా ఉండటంతోపాటు.. అటు 10 శాతం ఉన్న బడా బాబులకు రైతు భరోసా కట్‌ చేయడం ద్వారా రైతుల్లో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరుగుతుందని అంచనా వేస్తోంది. దీని వల్ల ఇచ్చిన హామీలు నెరవేరడంతో పాటు పార్లమెంట్‌ ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగా మారుతుందని భావిస్తోంది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.

ట్రెండింగ్ వార్తలు