Revanth Reddy : రేపు టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ!

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. రేవంత్ పీసీసీ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం అయింది.

Revanth Reddy : టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి రేపు (బుధవారం) జూలై 7న బాధ్యతలు స్వీకరించనున్నారు. రేవంత్.. పీసీసీ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం అయింది. భారీ సభకు ప్లాన్ చేశారు. లక్ష మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కను రేవంత్ ఆహ్వానించనున్నారు. ఈ సాయంత్రం ఉత్తమ్, భట్టితో ఆయన వేర్వేరుగా భేటీ కానున్నారు.

ఇప్పటికే రేవంత్ రాయబారిగా మల్లురవి భట్టితో చర్చలు జరిపారు. రేపటి కార్యక్రమానికి భట్టి విక్రమార్క హాజరవుతారని మల్లురవి తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అంతర్గత కుమ్ములాటలతో అస్తవ్యస్తంగా మారిన పార్టీకి పూర్వ వైభవాన్ని తేవాలని ప్రయత్నిస్తున్నారు. నేతలందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

సుదీర్ఘ కసరత్తు తర్వాత అధిష్టానం రేవంత్ ను టీపీసీసీ చీఫ్ గా ప్రకటించింది. ఈ ప్రకటన ఇలా వచ్చిందో లేదో అసంతృప్త జ్వాలలు భగ్గుమన్నాయి. కోమటిరెడ్డి లాంటి నేతలైతే బహిరంగంగానే రేవంత్ పై విమర్శలు చేశారు. భట్టి విక్రమార్క లాంటి నేతలకు ఢిల్లీలో బుజ్జగింపుల పర్వం నడిచింది. ఈ వారం రోజుల్లో అసంతృప్త జ్వాలలు కాస్తా చల్లారినట్లు కనిపిస్తున్నాయి.

పీసీసీ పగ్గాలు చేపట్టకముందే రేవంత్ మర్యాదపూర్వకంగా అందరినీ కలుస్తున్నారు. కోమటిరెడ్డి, భట్టి, ఉత్తమ్ లాంటి నేతలను మినహాయిస్తే మిగతా అందరి నేతలను రేవంత్ కలిశారు. ఆ నేతలు కూడా రేవంత్ కు మద్దతు ప్రకటించారు. రేపు బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో మరో ఇద్దరు కీలక నేతలను కలిసేందుకు రేవంత్ సిద్ధమయ్యారు.

పీసీసీ చీఫ్ గా రేవంత్ ను వ్యతిరేకిస్తున్న వర్గంలో భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. మొదటి నుంచి పార్టీ జెండా మోస్తున్న వాళ్లను పక్కన పెట్టి పక్క పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి ఎలా పగ్గాలు అప్పగిస్తారన్నది రేవంత్ వ్యతిరేక వర్గం వాదన.

కలవిహీనంగా మారిన కాంగ్రెస్ పార్టీలో కాస్తో కూస్తో ఇమేజ్ ఉన్న లీడర్లలో భట్టి విక్రమార్క ఒకరు… అందుకే ఆయన్ను బుజ్జగించటానికి అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. బుజ్జగింపుల ప్వర్వంగా రోజులపాటు నడిచింది. వరకు రేవంత్ నాయకత్వంలో కలిసి నడిచేందుకు భట్టి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో భట్టిని కలిసేందుకు రేవంత్ సిద్ధమయ్యారు.

మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డి కలవనున్నారు. రేపు పదవీ స్వీకరణ నేపథ్యంలో యన్ను ఆహ్వానించడానికి వెళ్తున్నారు. మరి ఉత్తమ్, భట్టి స్పందన ఎలా ఉంటుంది? రేవంత్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారు? అసలు రేపు జరిగే రేవంత్ పీసీసీ బాధ్యతల స్వీకరణకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు