కలెక్టరేట్‌లో కారు నిలిపాడు.. తెల్లారేసరికి టైర్లు కొట్టేశారు!

  • Publish Date - April 17, 2020 / 04:49 AM IST

సంగారెడ్డి కలెక్టరేట్ లో నిలిపిన ఓ కారు టైర్లు తెల్లారేసరికి మాయమైపోయాయి. ఈ కారు కలెక్టరేట్ లో పనిచేసే ఓ రెవిన్యూ ఉద్యోగిది.. ఎప్పటిలానే తన కారును కలెక్టరేట్‌లో నిలిపాడు. ఇటీవలే తాను ఉండే ప్రాంతంలో ఒకరికి కరోనా పాజిటివ్ తేలడంతో ఆ ఏరియాను రెడ్ జోన్‌గా ప్రకటించారు. అప్పటినుంచి తన కారును ఆయన కలెక్టరేట్ లోనే నిలుపుతున్నాడు. కారును అక్కడే ఉంచి ప్రతిరోజు విధులకు హాజరవుతున్నారు. 

రెండు రోజుల తర్వాత నిలిపి ఉంచిన కారును చూసేందుకు వచ్చారు. అంతే.. కారు పరిస్థితి చూసి షాక్ అయ్యాడు. తన కారుకు ఉండాల్సిన నాలుగు చక్రాలు మాయమయ్యాయి. కారు టైర్లు దొంగలించినవారిపై రెవిన్యూ ఉద్యోగి సంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

పోలీసుల పహారాతో ఉండే కలెక్టరేట్ లో టైర్లు మాయం కావడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది. ఇంతకీ రెవిన్యూ ఉద్యోగి కారు నాలుగు టైర్లను ఎవరూ ఎత్తుకెళ్లారు అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కలెక్టరేట్ సమీపంలోని సీసీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.