బాబోయ్.. బుర్ఖాలో వచ్చి, కత్తులు చూపించి.. పట్టపగలే దొంగల బీభత్సం.. షాకింగ్ వీడియో

ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు హల్ చల్ చేస్తున్నాయనే వార్తలతోనే నగరవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పుడు పట్టపగలే దోపిడీకి తెగబడటంతో మరింత హడలిపోతున్నారు.

Medchal Robbery : మేడ్చల్ లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు, అందునా పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న నగల షాపులో చోరీకి పక్కా స్కెచ్ వేశారు. కత్తిని చూపించి దోపిడీకి విఫలయత్నం చేశారు. అయితే, నగల షాపులో ఉన్న యజమాని, ఆయన సహాయకుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎదురు తిరగడంతో దొంగలు పారిపోయారు. జువెలరీ షాపులోకి దొంగలు చొరబడటం, కత్తిని చూపించి బెదిరించి డబ్బును దోచుకునేందుకు ప్రయత్నించడం సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యింది.

మేడ్చల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ పక్కనే జగదాంబ జువెలర్స్ షాప్ ఉంది. సరిగ్గా ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఓ బైక్ పై ఇద్దరు దొంగలు దర్జాగా వచ్చారు. దుండగుల్లో ఒకడు బురఖా ధరించగా, మరో వ్యక్తి తలకు హెల్మెట్ పెట్టుకున్నాడు. ఇద్దరూ షాపులోకి వచ్చీరాగానే వెంట తెచ్చుకున్న కత్తి తీసి షాపు యజమానిపై దాడి చేశారు. యజమానికి స్వల్ప గాయమైంది. డబ్బులు, నగలు సంచిలో వేయాలని బురఖా ధరించిన వ్యక్తి కత్తితో బెదిరించాడు. షాపు యజమాని దొంగలను నెట్టేసి పెద్దగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశాడు. దాంతో తాము ఎక్కడ దొరికిపోతామో అనే భయంతో దొంగలు వెండి వస్తువులను బ్యాగులో వేసుకుని పారిపోతుండగా.. ఆ సంచి కింద పడిపోయింది.

షాపులోనే ఉన్న యువకుడు దొంగలపై తిరగబడ్డాడు. బైక్ పై దొంగలు పారిపోతూ ఉండగా కుర్చీ విసిరికొట్టాడు. బైక్ వెనకాల కూర్చున్న ఆ దొంగకు కుర్చీ బలంగా తగిలింది. అయినా, దొంగలు ఉడాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు బంగారు దుకాణం వద్దకు వచ్చి సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. బైక్ నెంబర్ ఆధారంగా దొంగలు ఎవరు? ఎటువైపు వెళ్లారు? ఆరా తీస్తున్నారు.

ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు హల్ చల్ చేస్తున్నాయనే వార్తలతోనే నగరవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పుడు పట్టపగలే దోపిడీకి తెగబడటంతో మరింత హడలిపోతున్నారు. గతంలో నాగోల్ లోనూ ఓ నగల షాపులో ఇదే విధంగా దొంగలు బంగారాన్ని దోచుకెళ్లారు.

మేడ్చల్ జ్యువెలరీ షాపు దోపిడీ ఘటనకు సంబంధించి మేడ్చల్ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి వివరాలు వెల్లడించారు.”ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో జగదాంబ జ్యువెలరీ షాపులో ఇద్దరు దోపిడీ దొంగలు ప్రవేశించారు. ఒకరు హెల్మెట్ పెట్టుకోగా.. మరో వ్యక్తి బురఖా వేసుకుని షాపులోకి వచ్చాడు. వాళ్ళ వెంట తెచ్చుకున్న బ్యాగులోంచి కత్తి తీసి కౌంటర్ లో కూర్చున్న జ్యువెలరీ షాపు యజమానిపై కత్తితో దాడి చేశారు. శేషారాం చాకచక్యం గా వాళ్ళను తోసేసి బయటకు వెళ్ళారు. దోపిడీ దొంగల పెనుగులాటలో శేషారాంకు ఎడమ వైపు కత్తి గాటు అయింది. అంతరాష్ట్ర దోపిడీ దొంగల ముఠాగా అనుమానిస్తున్నాము. వారేనా? వేరే గ్యాంగ్ వచ్చిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నాము. లోకల్ పోలీసులు, ఎస్వోటీలతో కలిసి టీమ్స్ ఏర్పాటు చేశాం. త్వరలో దొంగలను పట్టుకుంటాం” అని అడిషనల్ డీసీపీ తెలిపారు.

Also Read : గన్‌తో బెదిరించి మహిళా కానిస్టేబుల్‌పై లైంగిక దాడి.. కాళేశ్వరం ఎస్ఐని డిస్మిస్ చేసిన ప్రభుత్వం

ట్రెండింగ్ వార్తలు