Rs 2000 Scheme : నెలకు రూ.2వేలు.. ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. వారికి కూడా సాయం.. ఫిర్యాదుల కోసం ప్రత్యేక కేంద్రాలు

ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా సాయాన్ని ప్రభుత్వం మరికొంత మందికి విస్తరించింది. బోధనేతర సిబ్బంది క్యాటగిరీలో ఆయాలు, డ్రైవర్లకు కూడా రూ.2 వేల నగదు, 25 కిలోల సన్నబియ్యం అందించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఇదివరకు టీచర్లు, క్లర్కులు, అకౌంటెంట్లు, లైబ్రరీ, ల్యాబ్‌ అసిస్టెంట్లు, అటెండర్లు, స్వీపర్లు మాత్రమే ఈ పథకానికి అర్హులని చెప్పారు. తాజాగా

Private School Teachers Scheme

Rs 2000 Scheme : కరోనా విపత్కర పరిస్థితుల్లో స్కూళ్లు లేక, వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ప్రైవేటు స్కూల్‌ టీచర్లు, సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. నెలకు రూ.2వేల నగదుతో పాటు ప్రతి నెల 25కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వనుంది ప్రభుత్వం. కాగా, ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా సాయాన్ని ప్రభుత్వం మరికొంత మందికి విస్తరించింది. బోధనేతర సిబ్బంది క్యాటగిరీలో ఆయాలు, డ్రైవర్లకు కూడా రూ.2 వేల నగదు, 25 కిలోల సన్నబియ్యం అందించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఇదివరకు టీచర్లు, క్లర్కులు, అకౌంటెంట్లు, లైబ్రరీ, ల్యాబ్‌ అసిస్టెంట్లు, అటెండర్లు, స్వీపర్లు మాత్రమే ఈ పథకానికి అర్హులని చెప్పారు. తాజాగా ఆయాలు, డ్రైవర్లను కూడా ఆ జాబితాలో చేర్చారు.

స్కూల్ లో పని చేసినట్టు ఆధారాలు చూపించాలి:
యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ఫర్‌ ఎడ్యుకేషన్‌ (యూడైస్‌)లో పేర్లు నమోదు కాని వారు కూడా సాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు పాఠశాలలో పనిచేసినట్టు ఆధారాలు చూపించాలని అధికారులు తెలిపారు. ఈ పథకానికి తొలిరోజే 2వేల 562 ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చాయి. ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులకు అవకాశమివ్వగా, భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశమున్నట్టు అంచనా వేస్తున్నారు.

అటెండెన్స్ రిజిస్టరే ప్రామాణికం:
ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు జిల్లాలవారీగా బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. మండలం లేదా పాఠశాలల సంఖ్య యూనిట్‌గా తీసుకుని ఈ బృందాలు ఏర్పాటవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో 5 స్కూళ్లకు, మరికొన్ని జిల్లాల్లో 20 స్కూళ్లకు ఒక బృందం చొప్పున నియమించారు. 2020 మార్చి 16 వరకు పాఠశాలల్లో పనిచేసిన వారంతా అర్హులేనని విద్యాశాఖ ఉత్తర్వుల్లో తెలపడంతో హాజరు రిజిస్టర్‌ను ప్రామాణికంగా తీసుకొని పరిశీలన జరపనున్నారు.

ప్రతి జిల్లాలో ఫిర్యాలు విభాగం:
హాజరు రిజిస్టర్‌లో పేరు లేకుంటే అక్విటెన్స్‌ రిజిస్టర్‌, లేదంటే బ్యాంకు స్టేట్‌మెంట్లను లబ్ధిదారులు రుజువుగా చూపాలని అధికారులు సూచించారు. స్కూళ్లలో పనిచేస్తున్నా ఒకవేళ స్కూల్ యాజమాన్యాలు విస్మరిస్తే వారి దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రతీ జిల్లాలో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఒకే పాఠశాల నుంచి అధికంగా దరఖాస్తులు వస్తే విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం 30 మందికి ఒక టీచర్‌ చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

సీఎం కేసీఆర్ పెద్ద మనసు:
కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల టీచర్లు, సిబ్బందిని ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. స్కూల్స్ తిరిగి తెరిచే వరకు వారికి రూ.2వేలు ఆపత్కాల ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యాన్ని రేషన్‌ షాపుల ద్వారా ఉచితంగా సరఫరా చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రైవేటు టీచర్లు, సిబ్బందిని మానవీయ దృక్పథంతో ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని సీఎం తెలిపారు.

1.45లక్షల మంది.. నెలకు రూ.42కోట్లు:
ఈ నెల(ఏప్రిల్) 20 నుంచే ఆర్థిక సాయం అందజేయనుంది ప్రభుత్వం. 20వ తేదీ నుంచి 24వ తేదీ లోపు.. ప్రైవేట్ టీచర్లు, సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో రూ.2వేలు డిపాజిట్ చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 10 నుంచి 15వ తేదీ వరకు విద్యాశాఖ… అర్హులైన వారి వివరాలను జిల్లాలకు పంపిస్తుందని.. 16 నుంచి 19వ తేదీ వరకు పరిశీలన, లబ్దిదారుల గుర్తింపు ఉంటుందన్నారు. అలాగే రేషన్ షాపుల ద్వారా 25కిలోల బియ్యం ఇస్తామన్నారు. దాదాపు 1.45లక్షల మంది టీచర్లు, సిబ్బంది ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారని.. వారికి సాయం కోసం నెలకు రూ.42కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.

తిరిగి స్కూళ్లు ఓపెన్ అయ్యే వరకు సాయం:
రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే వరకు ప్రతీ నెలా రూ.2వేలు నగదు సాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యాన్ని రేషన్‌ షాపుల ద్వారా ఉచితంగా సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా స్కూళ్లు మూతపడి.. వేతనాల్లేక కుటుంబాన్ని పోషించుకోలేని దయనీయ స్థితిలో ప్రైవేట్ టీచర్లు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో రెండు రోజుల క్రితం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ప్రైవేట్ టీచర్ కుటుంబం(భర్త, భార్య) ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ఆలోచించి ప్రైవేట్ టీచర్లకు నగదు సాయంతో పాటు బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది.

కరోనా దెబ్బకు ప్రైవేట్‌ టీచరు కుటుంబం ఛిన్నాభిన్నం:
కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కొంతమందిని నేరుగా కాటేస్తుండగా మరికొందరిని ఆర్థిక సమస్యల్లోకి నెట్టేసి ఉసురు తీసేస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్ కాలనీలో ప్రైవేట్‌ స్కూల్ టీచర్(వనం రవికుమార్-31) మంగళవారం(ఏప్రిల్ 6,2021) ఆత్మహత్య చేసుకున్నాడు. అది మరవకముందే ఆ ఇంట మరో విషాదం.. ఆయన భార్య మృతదేహం బుధవారం(ఏప్రిల్ 7,2021) రాత్రి వాగులో లభ్యమైంది. అలా.. కరోనా వైరస్ మహమ్మారి.. ఓ ప్రైవేట్ టీచర్ కుటుంబాన్ని చిన్నాబిన్నం చేసింది.