Site icon 10TV Telugu

కేవలం రూ.5కే హైదరాబాద్‌లో బ్రేక్ ఫాస్ట్.. పథకం అమలు ఆరోజు నుంచే.. తొలి దశలో 60 క్యాంటీన్లలో..

Rs 5 breakfast scheme,

Rs 5 breakfast scheme,

Indiramma Canteens in Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా రూ.5కే బేక్ ఫాస్ట్ అందించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 139 చోట్ల రూ.5కే భోజనం పెడుతుండగా.. పంద్రాగస్ట్ (ఆగస్టు 15వ తేదీ) నుంచి ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా రూ.5కే టిఫిన్ ను అందించే పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇందిరమ్మ క్యాంటీన్లలో రూ.5కే బ్రేక్ ఫాస్ట్‌ను గ్రేటర్ లోని అన్ని ప్రాంతాలకు దశల వారీగా అమలు చేయనున్నారు. తొలి దశలో 60 క్యాంటీన్లలో బ్రేక్ ఫాస్ట్ ను అందుబాటులోకి తేనున్న జీహెచ్ఎంసీ.. ఆ తరువాత దశల వారీగా 150 సెంటర్లకు విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ బ్రేక్ ఫాస్ట్ లో సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజుల పాటు ఇండ్లీ, పొంగల్, పూరి, ఉప్మా వంటి పౌష్టికాహారం అందించేందుకు జీహెచ్ఎంసీ మెనూ సిద్ధం చేసింది.

పూర్తిగా మిల్లెట్స్ తో తయారు చేయనున్న ఈ ఒక్కో టిఫిన్ కు రూ.19 ఖర్చు అవుతుండగా.. ఇందులో రూ.5 ప్రజల నుంచి వసూలు చేస్తుండగా.. మిగిలిన 14 రూపాయాలను జీహెచ్ఎంసీ భరించనుంది. ప్రస్తుతం రూ.5కే నాణ్యమైన భోజనాన్ని అందజేస్తున్న హరేరామ హరే కృష్ణ మూవ్‌మెంట్ ఈ బ్రేక్ ఫాస్ట్ స్కీం బాధ్యతలు తీసుకుంది. బస్తీ వాసులు, రోజువారీ కూలీలు, చిరు ఉద్యోగులకు రూ.5కే బ్రేక్ ఫాస్ట్ వరంలా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు.. ఇంతకుముందు ఉన్న స్టాల్స్ పూర్తిగా డ్యామేజ్ కావడంతో అన్నిచోట్లా రూ.11.43 కోట్ల వ్యయంతో కొత్త స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. క్యాంటీన్లలో పరిశుభ్రంగా ఉండేలా, నాణ్యత ప్రమాణాలు పాటించేలా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోనున్నారు.

Exit mobile version