TGSRTC Strike : ఆర్టీసీ సమ్మె షురూ.. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు బంద్.. డిపోలకే పరిమితం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి..
RTC Strike : ఆర్టీసీలో సమ్మె సైనర్ మోగింది. దీంతో బుధవారం ఉదయం నుంచి బస్సులు బంద్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.
- Harishth Thanniru
- Updated on- April 22, 2026 / 10:43 AM IST
RTC Strike
- సమ్మెబాట పట్టిన ఆర్టీసీ కార్మికులు
- రాష్ట్ర వ్యాప్తంగా డిపోలకే పరిమితమైన బస్సులు
- ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
- ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి
TGSRTC Strike : ఆర్టీసీలో సమ్మె సైనర్ మోగింది. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె బాట పడుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ మంగళవారం రాత్రి ప్రకటించింది. ప్రభుత్వం నియమించిన కమిటీ నాలుగు వారాల సమయం ఇవ్వాలని కోరగా.. జేఏసీ ఈ ప్రతిపాదనకు నిరాకరించింది. దీంతో బుధవారం ఉదయం నుంచి సమ్మె ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.
Also Read : రేవంత్ పేరును ఉచ్చరించకూడదని కేసీఆర్ డిసైడ్ అయ్యారా ?
ఉదయం నుంచి డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి.. దాదాపు వెయ్యికిపైగా బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో ప్రైవేట్ బస్సు డ్రైవర్లతో బస్సులను నిడిపేందుకు ప్రయత్నం చేయగా కార్మికులు ఆ బస్సులను అడ్డుకుంటున్నారు. కార్మికుల సమ్మెతో పెద్దపల్లిలో 150 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. మహబూబ్ నగర్ లో 112 బస్సులు డిపోకే పరిమితం కాగా.. ప్రయాణికుల కోసం 16 విద్యుత్ బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు.
మరోవైపు బస్సుల బంద్‌తో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయాన్నే బస్టాండ్ ల వద్దకు చేరుకోగా.. బస్సులు లేకపోవడంతో తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అయితే, ప్రయాణికుల ఇబ్బందులను కొంతమేర అయినా తొలగించేందుకు ప్రభుత్వం ప్రైవేట్ డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. పలు ప్రాంతాల్లో ప్రైవేట్ డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నప్పటికీ.. వాటిని కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బస్సులను ఎక్కువగా తిప్పేందుకు ఆర్టీసీ దృష్టి కేంద్రీకరించింది.
మరోవైపు.. ఆర్టీసీలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అందరూ విధులకు హాజరుకావాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్మికులు కోరుతున్న డిమాండ్లలో కొన్ని ఆర్థికపరమైనవి, సంక్లిష్టమైన అంశాలు ఉన్నాయి. వాటిని పరిశీలించి పరిష్కరించడానికి ప్రభుత్వానికి కనీసం నాలుగు వారాల సమయం పడుతుందని, సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కార్మికులందరూ విధులకు హాజరై ప్రభుత్వానికి సహకరించాలని ఎండీ నాగి రెడ్డి కోరారు.
