KCR : రేవంత్ పేరును ఉచ్చరించకూడదని కేసీఆర్ డిసైడ్ అయ్యారా ?
కేసీఆర్ (KCR) వ్యూహాత్మకంగానే రేవంత్ పేరు ఎత్తకుండా జాగ్రత్త పడుతున్నారనే గుసగుసలు విన్పిస్తున్నాయి.
Gossip Garage Has KCR decided not to pronounce Revanth name
- మరోసారి రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండానే కేసీఆర్ స్పీచ్
- జగిత్యాల సభలో 58 నిమిషాలు ప్రసంగించిన కేసీఆర్
- కనీసం ముఖ్యమంత్రి అన్న పదాన్ని పలకని కేసీఆర్
చాలా రోజుల తర్వాత జనంలోకి వచ్చారు గులాబీ బాస్. జగిత్యాల వేదికగా తనదైన శైలిలో ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. ఏకంగా తన చావును కోరుకుంటున్నారంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చి సోషల్ మీడియాకు కావాల్సిన స్టఫ్ ఇచ్చారు కేసీఆర్. సేమ్‌టైమ్ కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టిన ఆయన హైడ్రాను రద్దు చేస్తామంటూ ప్రకటించినా కూడా ఎక్కడా రేవంత్‌రెడ్డి పేరు తీయలేదు. కనీసం ముఖ్యమంత్రి అన్న పదం కూడా ఎత్తకుండా ప్రసంగాన్ని కంప్లీట్ చేశారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు తప్ప ఆయన పేరెత్తలేదు. కేసీఆర్ వ్యూహాత్మకంగానే రేవంత్ పేరు ఎత్తకుండా జాగ్రత్త పడుతున్నారనే గుసగుసలు విన్పిస్తున్నాయి.
గతేడాది ఏప్రిల్ 27న వరంగల్‌లో జరిగిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభలో కేసీఆర్ గంటకు పైగా మాట్లాడినప్పటికీ, రేవంత్ రెడ్డి పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. అదేసమయంలో డిప్యూటీ సీయం భట్టి ప్రస్తావన సైతం తీసుకొచ్చారు. ఆ సమయంలో అది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంపై, రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రాపై అటాక్ చేసిన కేసీఆర్ ఎక్కడా రేవంత్ రెడ్డి పేరును ఎత్తలేదు. కనీసం ముఖ్యమంత్రి అని గాని, సీఎం అనిగాని ప్రస్తావించలేదు. అయితే ఈసారి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పేరు ప్రస్తావించడం విశేషం.
రెండున్నరేళ్లలో ఒక్కసారి కూడా
రెండున్నరేళ్ల ప్రతిపక్ష హోదాలో ఒక్కసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరును పలకకపోవడంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రేవంత్‌రెడ్డి మాత్రం ప్రతీసభ, సమావేశం చివరకు చిట్చాట్లలోనూ కేసీఆర్‌పైనే అటాక్ చేస్తుండగా.. కేసీఆర్ మాత్రం రేవంత్ పేరు ప్రస్తావనకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వను అంటు డైరెక్ట్ ఎటాక్ చేస్తున్నారు రేవంత్. కేసీఆర్ చచ్చిన పాము అని, ఫాంహౌస్‌కే పరిమితం చేశానని చెప్పడమే కాదు..వ్యక్తిగత విమర్శలు చేసేందుకు కూడా వెనకాడటం లేదు సీఎం.
లేటెస్ట్గా రైతు భరోసా నిధుల విడుదల సభలోనూ కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రానివ్వనని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం జీవన్ రెడ్డి లాంటి కరడు గట్టిన కాంగ్రెస్ నేతలు కూడా రేవంత్ తీరుతో బయటకు వస్తున్నారంటూ జగిత్యాల సభలో కేసీఆర్ కచ్చితంగా రేవంత్‌పై అటాక్ చేస్తారని అంతా ఊహించారు. కానీ కేసీఆర్ మాత్రం కనీసం రేవంత్ పేరు తీయకుండానే స్పీచ్‌ను ముగించి మరోసారి చర్చకు తెరలేపారు.
ఇప్పుడే కాదు గత రెండున్నరేళ్ల కాలంలో పార్టీ అంతర్గత సమావేశాల్లోను కేసీఆర్ ఎక్కడా రేవంత్ రెడ్డి పేరును పలకలేదని బీఆర్ఎస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇక ముందు కూడా రేవంత్ రెడ్డి పేరును గులాబీ బాస్ కేసీఆర్ పలకకపోవచ్చని పార్టీ నేతలు అంటున్నారు.
