Telangana RTC Strike : చర్చలు విఫలం.. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్.. ఆ ఒక్క డిమాండ్ వద్దే సమస్య..
RTC Strike : ప్రభుత్వంతో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలమయ్యాయి. దీంతో అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది.
- Harish Thanniru
- Updated on- April 22, 2026 / 11:14 AM IST
RTC Strike
RTC Strike : ప్రభుత్వంతో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలమయ్యాయి. దీంతో అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. మంగళవారం రాత్రి అధికారుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ చర్చలు జరిపింది. సమస్యల పరిష్కారానికి నాలుగు వారాల సమయం కావాలని ప్రభుత్వం తరపున కమిటీ కోరింది.
Also Read : నడిపించేది మేమే.. రేవంత్ క్లారిటీ అందుకేనా?
అయితే, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన అంశం తప్ప.. మిగిలిన డిమాండ్ల పరిష్కారానికి ప్రయత్నిస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలతో కమిటీ స్పష్టం చేసింది. కమిటీ ప్రతిపాదనకు ఆర్టీసీ జేఏసీ నాయకులు నిరాకరించారు. దీంతో చర్చలు విఫలం అయ్యాయి. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో సమ్మెలోకి వెళ్లేందుకు టీజీఎస్ ఆర్టీసీ కార్మికులు సిద్ధమయ్యారు. దీంతో బుధవారం నుంచి బస్సులు బంద్ కానున్నాయి.
ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మాట్లాడుతూ.. మా సమస్యలను అధికారులకు వివరించాం. ఐఏఎస్ అధికారుల కమిటీ నాలుగు వారాల గడువు కోరింది. మా డిమాండ్లు కొత్తవి కావు. గతంలో ఇచ్చిన హామీలే. తప్పని సరి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నాం. 32 డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి మాట్లాడుతూ.. మా సమస్యలు కొత్తవేం కాదు. గతం నుంచి ఉన్నవే. ప్రభుత్వ మేనిఫెస్టోలోని అంశాలే మేం అడుగుతున్నామని అన్నారు. అయితే, నేటి అర్ధరాత్రి వరకూ ప్రభుత్వానికి సమయం ఉందని కూడా జేఏసీ మరోసారి స్పష్టం చేసింది.
కాగా.. ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా పీఆర్సీ అమలు, బకాయిల చెల్లింపుపై వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. అర్ధరాత్రి వరకూ ఎటువంటి స్పష్టత రాకపోతే ఆర్టీసీ సిబ్బంది సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొంటామని హెచ్చరించారు. మరోవైపు.. సమ్మె నిర్ణయంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తుగా ప్రయాణాలకోసం ప్లాన్ చేసుకొని బస్సుల్లో సీట్లు బుక్ చేసుకున్న ప్రయాణికుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.
