Rythu Bharosa 2nd Installment: రైతుభరోసాపై ప్రభుత్వం మరో కీలక అప్డేట్.. లబ్ధిదారులు వెంటనే ఇలా చేయండి..
Rythu Bharosa : యాసంగి సీజన్లో రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం విడుదల చేసిన రెండో విడత నిధులు మంగళవారం రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ విడతలో 45,11,947 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,206,06 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.
- Harishth Thanniru
- Updated on- April 22, 2026 / 11:11 AM IST
Rythu Bharosa Scheme
- రెండో విడతలోనూ ఎకరానికే రైతుభరోసా
- వచ్చేనెల మొదటి వారంలో మూడో విడత నిధులు
- నల్గొండ జిల్లాకు అత్యధికంగా నిధులు
Rythu Bharosa : పంటల సాగు సమయంలో రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ప్రతీయేటా వానాకాలం పంట సాగు సమయంలో ఎకరాకు రూ.6వేలు, యాసంగి పంట సాగు సమయంలో రూ.6వేలు చొప్పున మొత్తం ఏడాదికి ఎకరానికి రూ.12వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రస్తుతం యాసంగి సీజన్‌కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత నిధులను అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేశారు.
యాసంగి సీజన్లో రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం విడుదల చేసిన రెండో విడత నిధులు మంగళవారం రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ విడతలో 45,11,947 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,206,06 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. గత నెలలో నర్మెంట్టలో నిర్వహించిన సభ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఒక ఎకరానికి సంబంధించిన రైతు భరోసా నిధులను రూ.3,446.94 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. మొదటి, రెండో విడత కలిపి మొత్తం రూ.5,653 కోట్లు 71.05 లక్షల రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.
మొదటి విడతలో ఒక ఎకరంకు రైతు భరోసా నిధులు జమ చేసిన ప్రభుత్వం.. రెండో విడతలోనూ 45.12లక్షల మంది రైతులకు మరో ఎకరానికి రైతు భరోసా కింద రూ.6వేలు జమ చేసింది. పూర్తిస్థాయిలో రైతులకు అందింది కేవలం రెండు ఎకరాలకు మాత్రమే. పూర్తి స్థాయిలో రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ కావాలంటే మరో రూ.3,400 కోట్లు వరకు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే, వచ్చే నెల ప్రారంభంలో మూడో విడత రైతు భరోసా నిధులు విడదల చేస్తామని అధికారులు చెబుతున్నారు.
అయితే, మూడో విడతలో ఐదు ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు జమ చేస్తారా.. మొదటి, రెండు విడతలవలే కేవలం ఒక ఎకరం లేదంటే రెండు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా నిధులు వేస్తారా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అయితే, అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. మూడో విడతలో మరో రెండు ఎకరాలకు రైతు భరోసా నిధులు విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
ఇదిలాఉంటే.. రైతు భరోసా కింద రెండు విడతల్లోనూ అత్యధికంగా నల్గొండ జిల్లాకు రూ.448.09కోట్లు విడుదలయ్యాయి. 5,40,693 మంది రైతులకు లబ్ది చేకూరింది. నల్గొండ తరువాత ఖమ్మం జిల్లాలో 3,45,142 మంది రైతులకు రూ.271.52 కోట్లు, మూడో స్థానంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన 3,66,343 మంది రైతుల ఖాతాల్లో రూ. 271.05 కోట్లు జమ అయ్యాయి. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన 35,530 మంది రైతులకు రూ.15.65 కోట్లు జమ అయ్యాయి.
రెండో విడతలో రైతు భరోసా నిధులు జమకాని రైతులు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను లేదంటే మండల రెవెన్యూ అధికారులను సంప్రదించాలని, అర్హుత కలిగిన రైతులు పాస్ పుస్తకాలతోపాటు.. పూర్తి వివరాలను సమర్పించాలని, వాటిని పరిశీలించి రైతు భరోసా నిధులు జమ చేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు.
