Sabitha Indra Reddy: మీరా మా గురించి మాట్లాడేది.. ఏపీ దుస్థితి ఇంత ఘోరంగా ఉంది: బొత్సకు సబిత కౌంటర్

తెలంగాణ విద్యా వ్యవస్థను వేలెత్తి చూపేంతస్థాయి ఏపీ మంత్రికి లేదని అన్నారు.

Sabitha Indra Reddy

Sabitha Indra Reddy – Botsa Satyanarayana: తెలంగాణ (Telangana) విద్యా వ్యవస్థ, పరీక్షల నిర్వహణలో లోపాలపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేశారని చెప్పారు.

బొత్స చేసిన వ్యాఖ్యలు తెలంగాణను కించపర్చేలా ఉన్నాయని సబిత అన్నారు. ఆయన వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యా వ్యవస్థను వేలెత్తి చూపేంతస్థాయి ఏపీ మంత్రికి లేదని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలపై చర్చించేందుకు సిద్ధమా అని సవాలు విసిరారు. తాము చేసింది ఏంటో, ఏపీలో ఉద్ధరించింది ఏంటో చర్చించాలని అన్నారు.

తెలంగాణలో ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని దుస్థితిలో ఏపీ మంత్రులు ఉన్నారని చెప్పారు. తెలంగాణ ఇప్పటికే రెండుసార్లు ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయని తెలిపారు. ఆ విషయాలను తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని అన్నారు.

తాము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నామని సబిత చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ విజన్ వల్ల ఇక్కడ విద్యా వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. తెలంగాణలో ఐఐటీ, మెడికల్, ఇంజరింగ్ విద్యార్థులు సాధించిన ఫలితాలు బొత్స సత్యనారాయణకు కనబడటం లేదా అని ప్రశ్నించారు.

గురుకులాలతో ఒక్క విద్యార్థిపై తెలంగాణ చేస్తున్న ఖర్చు, ఏపీలో చేస్తున్న ఖర్చు ఎంతో గుర్తుంచుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ బడుల్లో లక్ష మంది విద్యార్థులు ఎందుకు తగ్గారని నిలదీశారు. తెలంగాణలో మాత్రం ప్రభుత్వ బడుల్లో రెండున్నర లక్షల మంది విద్యార్థులు పెరిగారని చెప్పారు.

Telangana Congress: కాకరేపిన ‘కరెంట్’ కామెంట్లు.. రేవంత్‌రెడ్డిపై రగులుతున్న సీనియర్లు