sahara idols : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి…ఆలయ పునర్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. ఆధ్మాత్మికత ఉట్టిపడేలా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆలయ ప్రాకారాలను చూడగానే..భక్తి తన్మయత్వం చెందేలా తయారు చేస్తున్నారు. అలాగే..ఆలయం ద్వితీయ ప్రాకారం వెలుపల సాలహారాల్లో మొత్తం 140 విగ్రహాలను అమర్చాలని వైటీడీఏ అధికారులు నిర్ణయించారు.
ఈ మేరకు ఏపీలోని కర్నూలు జిల్లా కోయిలకుంటలో ఏకశిలలతో సాలహార విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. 2021, జనవరి 19వ తేదీ మంగళవారం ఉదయం 32 సాలహార విగ్రహాలను యాదాద్రి క్షేత్రానికి తరలించారు. మిగతా 108 విగ్రహాలను సైతం త్వరలో తీసుకరానున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక సాలహార విగ్రహాలను అమర్చే పనులను త్వరలోనే చేపట్టనున్నట్లు వైటీడీఏ అధికారులు వెల్లడించారు.
అంతర్జాతీయ స్థాయిలో ప్రజలందరినీ ఆకర్షించేంత హంగులతో నారసింహుని కోవెల నిర్మాణం జరుగుతోంది. అందుకోసం నిష్ణాతులైన స్తపతులు… ఉలులతో శిలలకు ప్రాణం పోస్తున్నారు. లక్ష్మీ నరసింహుడి ఆలయం ఎన్నో ప్రత్యేకతలు.. మరెన్నో విశేషాలతో నిర్మాణమవుతోంది.
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఏడు రాజగోపురాలు, నాలుగువైపులా మాడ వీధులు, పన్నిద్దరు ఆళ్వారుల మండపాల నిర్మాణాలతో యాదాద్రి… నారసింహాద్రిగా వెలుగులీననుంది. 500 మందికి పైగా శిల్పుల చేతిలో యాదాద్రి టెంపుల్ రూపుదిద్దుకుంటోంది. ప్రధాన ఆలయమైన గర్భగుడి చుట్టూ గోపురాలు, నలువైపులా ద్రావిడశైలి శిల్ప సంపద… అతికొద్ది రోజుల్లోనే కనువిందు చేయనున్నాయి. ఇంతకు ముందు అర ఎకరం స్థలంలో ఉన్న ఆలయాన్ని.. ప్రస్తుతం రెండున్నర ఎకరాల్లో సువిశాలంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన ఆలయ విస్తరణలో ఏడు రాజగోపురాలు నిర్మితమవుతున్నాయి. పశ్చిమ రాజగోపురం 77 అడుగుల్లో రూపొందుతోంది. దీన్ని సప్తతలగా వ్యవహరిస్తున్నారు. అంటే ఏడంతస్తులుగా ఉండబోతుంది. ఇక దక్షిణం, ఉత్తరం, తూర్పు రాజగోపురాలు… 55 అడుగుల్లో నిర్మిస్తున్నారు.