రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటారా? అంటూ కేటీఆర్‌పై మండిపడ్డ కాంగ్రెస్

ఆ విగ్రహం తీసేద్దామనుకునేలోపు ప్రజలు బీఆర్ఎస్‌కి గోరీ కడతారని చెప్పారు.

Sama Ram Mohan Reddy

హైదరాబాద్‌లోని సచివాలయం ఎదుట పెట్టిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తాము తెలంగాణలో తిరిగి అధికారంలోకి రాగానే తొలగిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. బీజేపీ మాటలు కేటీఆర్ నోటి నుండి వస్తున్నాయని కాంగ్రెస్ మీడియా కమ్యునికేషన్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వద్ద సామ రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇన్ని రోజులు బీజేపీ మాత్రమే రాజీవ్ గాంధీని వ్యతిరేకించిందని, ఇప్పుడు బీఆర్ఎస్ దానికి జత కట్టిందని చెప్పారు. బీజేపీ మెప్పు పొందెందుకే కేటీఆర్ రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతున్నారని అన్నారు.

రాజీవ్ గాంధీ చరిత్ర గొప్పదని కేసీఆర్ అన్నారని, ఆ విగ్రహం తీసేద్దామనుకునేలోపు ప్రజలు బీఆర్ఎస్‌కి గోరీ కడతారని చెప్పారు. తాము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, రైతులను రుణ విముక్తులను చేశామని అన్నారు. రైతులు పండగ చేసుకుంటే, బీఆర్ఎస్ నాయకులు పెయిడ్ నిరసనలు చేయిస్తున్నారని తెలిపారు. 5 సంవత్సరాల్లో నాలుగు దఫాలుగా బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ కేవలం మిత్తికి కూడా సరిపోలేదని చెప్పారు. తాము నెల లోపే రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశామని తెలిపారు.

Also Read: అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

 

ట్రెండింగ్ వార్తలు