Jagga Reddy
Sangareddy MLA Jagga Reddy : తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జగ్గారెడ్డి.. పార్టీ కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు. ఉదయం 11గంటలకు సంగారెడ్డిలో కార్యకర్తలతో భేటీ అవుతారు. ఆ వెంటనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఏ నిర్ణయం తీసుకుంటారా అనే ఆసక్తి నెలకొంది. రేవంత్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ ఇవ్వడంతో.. రేసులో ఉన్న జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అవకాశం చిక్కినప్పుడల్లా ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే డమ్మీ పోస్ట్ అంటూ.. బాహాటంగానే తన అసహనాన్ని వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. సీఎం కేసీఆర్ పుట్టిన రోజునాడు కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేశారు. అయితే.. జగ్గారెడ్డి మాత్రం.. తన వైఖరికి భిన్నంగా స్పందించారు. నిరుద్యోగ సమస్య వేరు, పుట్టినరోజు వేరంటూ సీఎం కేసీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు.
Read More : Jagga Reddy: కాంగ్రెస్‌కి జగ్గారెడ్డి గుడ్ బై? నా వల్లే ప్రాబ్లమ్ ఐతే నేనెళ్లిపోతా!
కాంగ్రెస్ నుంచి తనను బయటకు పంపేందుకు కొందరు నేతలు కుట్ర చేస్తున్నారంటూ ఇటీవల అనుచరులతో వ్యాఖ్యానించారు. గుర్తింపు లేనిచోట పని చేయడం అవసరమా అంటూ అనుచరులతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు.. పార్టీ కోసం పని చేస్తుంటే.. కోవర్టుగా ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోందని జగ్గారెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే ఇవన్నీ కారణాలతో అనుచరులతో సమావేశం తర్వాత.. రాజకీయ భవిష్యత్‌పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకాన్ని జగ్గారెడ్డి వ్యతిరేకించారు.
Read More : TPCC Rachabanda : టీపీసీసీ చీఫ్‌ను మార్చాలన్న జగ్గారెడ్డి..సోనియా, రాహుల్‌లకు లేఖ
అయితే.. వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించడంతో సర్దుకపోవాలని భావించారని, కానీ..హుజూరాబాద్ ఉప ఎన్నిక సహా పలు అంశాలపై రేవంత్ ను బహిరంగంగానే తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఉమ్మడి మెదక్ జిల్లాలో తనకు సమాచారం ఇవ్వకుండా రేవంత్ పర్యటించడంపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ ను తప్పించాలంటూ అధిష్టానానికి లేఖలు రాయడం.. పార్టీలో తీవ్ర చర్చనీయాంశకు దారి తీశాయి. అధిష్టానం జగ్గారెడ్డిని మందలించినట్లు తర్వాత వార్తలు వెలువడ్డాయి. రాష్ట్ర నేతలు కూడా జోక్యం చేసుకోవడంతో రేవంత్ గురించి తాను మాట్లాడబోనని జగ్గారెడ్డి ప్రకటించారు. చాలా అంశాల్లో రేవంత్ వర్గంతో ఆయనకు విబేధాలు కొనసాగుతూ వచ్చాయి. మరి జగ్గారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.