Khammam District
Khammam District : ప్రస్తుతం ఉన్న సమాజంలో మూగజీవాల గోడు పట్టించుకునేంత సమయం ఎవరికి లేదు. అనారోగ్యంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయిన శునకాన్ని బ్రతికించాలనుకున్నారు పోలీసులు. దాని ప్రాణాలు కాపాడాలని విశ్వ ప్రయత్నం చేశారు. చివరికి చనిపోయిన ఆ శునకానికి మానవత్వంతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసుల మంచి మనసుని అందరూ మెచ్చుకుంటున్నారు.
Kakinada : హృదయ విదారక ఘటన.. యజమాని చనిపోయిందని తెలీక ఆమె చెప్పుల దగ్గర కాపలా కాస్తున్న శునకం
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ శునకం ఎక్కువగా సంచరిస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా ఆ శునకం అనారోగ్యానికి గురై అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. వెంటనే దానిని గమనించిన సిఐ కరుణాకర్ పశు వైద్యులను రప్పించి దగ్గరుండి వైద్యం చేయించారు. శునకానికి సెలైన్ కూడా పెట్టారు. దాని ప్రాణాలు కాపాడాలని చేసిన ప్రయత్నం విఫలమై శునకం చనిపోయింది. మృతి చెందిన శునకం కళేబరానికి పోలీస్ స్టేషన్ సమీపంలో సిఐ కరుణాకర్, ఇతర సిబ్బంది కలిసి అంత్యక్రియలు నిర్వహించారు.
నిత్యం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సంచరించే శునకం చనిపోవడంతో పోలీస్ సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. మూగజీవి పట్ల పోలీస్ అధికారి కరుణాకర్ చూపిన మానవత్వం చూసి అందరూ అభినందించారు.