తెలంగాణలో వరుస ఎన్నికలు మంత్రులకు చికాకు తెప్పిస్తున్నాయా?

తెలంగాణలో వరుస ఎన్నికలు మంత్రులకు చికాకు తెప్పిస్తున్నాయా? వారికి ఇబ్బందికరంగా పరిణమించాయా? ఎన్నికల్లో బిజీగా ఉండడంతో తమ శాఖలపై అమాత్యులు ఫోకస్‌ పెట్టలేకపోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

series of elections in Telangana : తెలంగాణలో వరుస ఎన్నికలు మంత్రులకు చికాకు తెప్పిస్తున్నాయా? వారికి ఇబ్బందికరంగా పరిణమించాయా? ఎన్నికల్లో బిజీగా ఉండడంతో తమ శాఖలపై అమాత్యులు ఫోకస్‌ పెట్టలేకపోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓవైపు ప్రచార బాధ్యతలు.. మరోవైపు గెలుపుకోసం టార్గెట్లు. ఇలా వరుస ఎన్నికల మధ్య మంత్రులు నలిగిపోతున్నారు.

తెలంగాణలో రెండోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక బాధ్యతలు చేపట్టిన మంత్రులు… బిజీ బిజీగా ఉంటున్నారు. 2018 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడ్డాయి. ఇక గండం గడిచింది… ఇక చిన్నాచితకా తప్ప పెద్ద ఎన్నికలేముంటాయిలే అని అప్పుడు భావించారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికలు ముగియగానే.. గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. కిందామీదపడి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను విజయతీరాలకు చేర్చి.. గులాబీ బాస్‌ దగ్గర శెభాష్‌ అనిపించుకున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిసి అలా రిలాక్స్‌ అవుదామనుకుంటున్న సమయంలోనే….. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చాయి.

అందులోనూ మెజార్టీ స్థానాలు గెలుచుకొనేందుకు బాగా శ్రమించారు. ఆ తర్వాత గ్యాప్‌ ఇవ్వకుండానే మున్సిపల్‌ ఎన్నికలకు నగారా మోగింది. ఇంకేముంది మన మంత్రివర్యులు తమ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో పార్టీని గెలిపించడం బాధ్యతగా తీసుకున్నారు. సర్వశక్తులు ఒడ్డి మున్సిపల్‌ పోరులోనూ విజయ దుందుబి మోగించారు. ఇవి ముగిసిన కొన్నాళ్లకే సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులోనూ ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూ పార్టీ మద్దతుదార్లను గెలిపించుకుని బాస్‌ దృష్టిలో పడ్డారు.

రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రులకు వివిధ రకాల ఎన్నికలు సవాల్‌ విసురుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న దుబ్బాక ఉప ఎన్నిక, ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ ఎలక్షన్స్‌.. ఈ ఎన్నికల్లోనూ మంత్రులు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కాలుకుబలపం కట్టుకుని తిరిగారు. ఎక్కడ ఇంచార్జీ బాధ్యతలు అప్పగిస్తే… అక్కడ పగలు రాత్రి అన్నా తేడాలేకుండా పనిచేశారు. బల్దియా ఎన్నికలు ముగిసి… మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరిగిందో లేదో… ఇప్పుడు మరో ఎన్నిక వచ్చిపడింది. రెండు గ్రాడ్యుయేట్‌ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో మళ్లీ మంత్రులకు చేతినిండా పనిపడింది. పలువురు మంత్రులను సీఎం కేసీఆర్‌ జిల్లాల వారీగా ఇంచార్జీ బాధ్యతలు అప్పగించారు. దీంతో అమాత్యులు రెండుచోట్లా అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక… వరుసగా జరుగుతున్న ఎన్నికలతో మంత్రులు, పార్టీ ముఖ్యనేతలంతా ఎన్నికల ప్రచారంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఫలితంగా మంత్రులు తమకు కేటాయించిన శాఖలపై పెద్దగా దృష్టి సారించలేకపోతున్నారు. చాలా మంది మంత్రులకు కొత్త శాఖలు కేటాయించారు సీఎం. దీంతో వారు తమ శాఖలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోతున్నారు.

ఎన్నికల ప్రచారాలు, అభ్యర్థుల గెలుపు భుజాలకెత్తుకుని పనిచేస్తుండడంతో… శాఖల వారీగా సమీక్షలు కూడా నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలకు మంత్రులు అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు వరుస ఎన్నికలు మంత్రులనూ చికాకుకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. నెలల వ్యవధిలో ఎన్నికలు వస్తుండడంపై మంత్రులు చిరాకు పడుతున్నట్టు సమాచారం. వారికి కొంత ఇబ్బందిగా కూడా మారినట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు