Illegal Land Deal Racket: పరారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే..! అక్రమ భూ దందా కేసులో సంచలన విషయాలు..

గండిపేట సర్వే నెంబర్ 18 ప్రభుత్వ భూమిపై నిందితులు నకిలీ పత్రాలను సృష్టించారు. వాట్సాప్, సోషల్ మీడియాలో ఫేక్ జీఓలు వైరల్ చేశారు.

  • Updated on- May 30, 2026 / 01:39 AM IST

Illegal Land Deal Racket: ఫేక్ డాక్యుమెంట్లతో అక్రమ భూ ఒప్పందాల దందా చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ నార్సింగి పోలీసులు రట్టు చేశారు. ముఠాకు చెందిన నిమ్మల రాజేశ్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయి కిరణ్ లను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గండిపేట సర్వే నెంబర్ 18లోని ప్రభుత్వ భూమిపై నకిలీ పత్రాలను నిందితులు సృష్టించారు. వీటిని వాట్సాప్, సోషల్ మీడియాలో షేర్ చేసి ఎకరా భూమిని మూడున్నర కోట్లకు విక్రయించేందుకు స్కెచ్ వేశారు. ఈ విధంగా మొత్తం 10 ఎకరాల భూమికి బొల్లా రమేశ్ అనే వ్యక్తితో నిమ్మల రాజేశ్ గౌడ్ ఫ్యామిలీ నకిలీ ఎంవోయూని కుదుర్చుకుంది.

ఈ వ్యవహారం గండిపేట తహసీల్దార్ కు తెలియడంతో నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాఫ్తు చేపట్టిన పోలీసులు కీలక విషయాలను బయటపెట్టారు. ఈ ముఠాతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకి సంబంధం ఉందని తేల్చారు పోలీసులు. ఈయన బ్యాంక్ ఆకౌంట్ నుంచి రెండు దఫాలుగా కోటి రూపాయలు, 25లక్షలు చొప్పున నిందితుల అకౌంట్ లోకి బదిలీ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ గ్యాంగ్ తో సంబంధం ఉన్న బొల్లా రమేశ్, బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు బొల్లా రాధాక్రిష్ణ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.నకిలీ జీవోలు, అక్రమ భూ ఒప్పందాల దందా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో నిందితులపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. అరెస్ట్ అయిన వారిలో నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయికిరణ్ ఉన్నారు.బొల్లా రమేష్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు, సునీల్, రాధాకృష్ణ పరారీలో ఉన్నారని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.

”గండిపేట సర్వే నెంబర్ 18 ప్రభుత్వ భూమిపై నిందితులు నకిలీ పత్రాలను సృష్టించారు. వాట్సాప్, సోషల్ మీడియాలో ఫేక్ జీఓలు వైరల్ చేశారు. ఐదు ఫేక్ జీవోలను తయారు చేసి ప్రభుత్వం ఈ భూమిని మాకు క్రమబద్దీకరించింది అంటూ ప్రచారం మొదలు పెట్టారు. తహసీల్దార్ ఫిర్యాదుతో భూ మోసం వెలుగులోకి వచ్చింది. కోర్ట్ ఆదేశాలతో నిందితుల ఇళ్లలో సోదాలు చేశాము. బ్యాంక్ పాస్‌ బుక్స్, మొబైళ్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నాం. ప్రభుత్వ పోరంబోకు భూమిపై హక్కులు అంటూ నిమ్మల కుటుంబం క్లెయిమ్ చేస్తూ వచ్చింది. హైకోర్టులో భూమి తమదే అని పిటిషన్లు దాఖలు చేశారు నిందితులు.

అక్టోబర్ 2025లో నిందితుల పిటిషన్లు హైకోర్టు కొట్టివేసింది. చట్టబద్ధ హక్కులు లేకున్నా ఎకరాకు 3.5 కోట్లకు భూమి అమ్మకానికి కుట్ర చేశారు. బొల్లా రమేష్, బ్రహ్మ నాయుడులతో భూమి అమ్మకానికి ఒప్పందం కుదుర్చుకున్నారు నిందితులు. బొల్లా బ్రాహ్మనాయుడు వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే. బొల్లా బ్రాహ్మ నాయుడు నుండి రెండుసార్లు నిమ్మల ఫ్యామిలీకి డబ్బు ట్రాన్స్ ఫర్ అయింది.

చేతులు మారిన 4 కోట్లు..

కసారి కోటి రూపాయలు, మరోసారి 25 లక్షలు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. అక్రమ భూ డీల్‌లో 4 కోట్లు చేతులు మారినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించినట్టు నకిలీ జీఓలు తయారీ చేశారు. ఫోర్జరీ పత్రాలతో భూమి యాజమాన్యం చూపించే ప్రయత్నం ముగ్గురు నిందితులు చేశారు. నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నాం. ఫేక్ జీఓలు, ఫోర్జరీ పత్రాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. భూమి కొనుగోలు ముందు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రికార్డులు తప్పనిసరిగా చెక్ చేయాలి” అని శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ సూచించారు.

”గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా యత్నంలో వైసీపీ నేత, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లం బ్రహ్మనాయుడు ఉన్నారు. నిమ్మల ఫ్యామిలీతో గండిపేటలోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంఓయు చేసుకున్నారు బొల్లం బ్రహ్మనాయుడు. ఎకరం 3.5 కోట్ల చొప్పున 10 ఎకరాలకు 35 కోట్లు ఒప్పందం. భూమిని తాను రెగ్యులరైజ్ చేయిస్తానని నిమ్మల ఫ్యామిలీతో ఒప్పందం చేసుకున్నారు. నిమ్మల ఫ్యామిలీకి, బొల్లం బ్రహ్మనాయుడుకి మధ్య రాధాకృష్ణ మధ్యవర్తిత్వం చేశాడు. నిమ్మల ఫ్యామిలీతో కలిసి బొల్లం బ్రహ్మనాయుడు నకిలీ జీవోలను తయారు చేసి ల్యాండ్ ను మార్కెట్లో పెట్టాడు. బ్రహ్మనాయుడు పై కేసు నమోదు చేశాము. మాజీ ఎమ్మెల్యే పరారీలో ఉన్నాడు” అని పోలీసులు తెలిపారు.