Heat Wave : మరో 3 రోజులు మంటలే.. తెలంగాణలో భానుడి భగభగలు, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు

Heat Wave : సూర్యాపేట జిల్లా మునగాలలో రికార్డు స్థాయిలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ జిల్లా దామెరచర్లలో 45.1 డిగ్రీలు, కరీంనగర్ లో 44.9 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెల పాడులో 44.8 డిగ్రీలు..

Heat Wave

Telangana Heat Wave : ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మాడు పగిలేలా ఉన్న ఎండల ధాటికి జనం విలవిలలాడిపోతున్నారు. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇవేం ఎండలు బాబోయ్ అని బెంబేలెత్తిపోతున్నారు. తెలంగాణలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. భానుడి భగభగలకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది.

వాయువ్య దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. దాంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో భారీగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. సూర్యాపేట జిల్లా మునగాలలో రికార్డు స్థాయిలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ జిల్లా దామెరచర్లలో 45.1 డిగ్రీలు, కరీంనగర్ లో 44.9 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెల పాడులో 44.8 డిగ్రీలు, జగిత్యాలలో 44.5 డిగ్రీలు, నల్లగొండ జిల్లా పజ్జుర్ లో 44.7 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూర్ పహాడ్ లో 44.7 డిగ్రీలు, సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

High Temperatures In AP: నిప్పుల కొలిమి..! అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాల్పులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

రాబోయే 3 రోజుల పాటు ఇదే తరహాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 38 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. మరో మూడు రోజులు మంటలే అన్న వాతావరణ శాఖ హెచ్చరికతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు అత్యవసరమైతే తప్ప ఎండలో తిరగొద్దని అధికారులు హెచ్చరించారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు.

Also Read..Hot Summer : బీకేర్‌ఫుల్.. మరింత మండిపోనున్న ఎండలు, రికార్డు స్థాయిలో పెరగనున్న ఉష్ణోగ్రతలు- ఐఎండీ వార్నింగ్