Hot Summer : బీకేర్‌ఫుల్.. మరింత మండిపోనున్న ఎండలు, రికార్డు స్థాయిలో పెరగనున్న ఉష్ణోగ్రతలు- ఐఎండీ వార్నింగ్

Hot Summer : ఈ రేంజ్ లో ఉష్ణోగ్రతలు పెరగడంతో జనాలు భరించలేకపోతున్నారు. ఉదయం నుంచే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

Hot Summer : బీకేర్‌ఫుల్.. మరింత మండిపోనున్న ఎండలు, రికార్డు స్థాయిలో పెరగనున్న ఉష్ణోగ్రతలు- ఐఎండీ వార్నింగ్

Hot Summer(Photo : Google)

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. గత వారంలో వర్షాలతో జనం కాస్త ఉపశమనం పొందినా, క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు మళ్లీ అల్లాడిపోతున్నారు. ఓవైపు మండుటెండలు, మరోవైపు విపరీతమైన ఉక్కపోత.. తట్టుకోలేక జనాలు విలవిలలాడిపోతున్నారు.

ఇది చాలదన్నట్లు వడగాల్పులు దడ పుట్టిస్తున్నాయి. ఇవేం ఎండలు రా నాయనా అని జనాలు నిట్టూరుస్తున్నారు. మాడు పగిలే ఎండలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

46 నుంచి 47 డిగ్రీలు నమోదయ్యే చాన్స్..
తెలంగాణ, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. ఈ రేంజ్ లో ఉష్ణోగ్రతలు పెరగడంతో జనాలు భరించలేకపోతున్నారు. ఉదయం నుంచే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. అసలే మండుటెండలతో అల్లాడిపోతుంటే, వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం 45 డిగ్రీలు దాటని ఉష్ణోగ్రతలు ముందు ముందు 46 నుంచి 47 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ కూడా అంచనా వేసింది.

Also Read..Karnataka: ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి? ఫలితాలు ఎలా వచ్చాయి?

కరీంనగర్ జిల్లాలో రికార్డ్ ఉష్ణోగ్రతలు నమోదు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిన్న అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీణవంక మండలంలో అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. జగిత్యాల జిల్లా జైనలో 45.4 డిగ్రీలు, సారంగపూర్ లో 45 డిగ్రీలు, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో 44.6 నుంచి 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లాలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. మరో వారం రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.

వణుకు పుట్టిస్తున్న వడగాల్పులు..
ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎండలు మండిపోతున్నాయి. కాగా, ఎండల తీవ్ర కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించింది. రాష్ట్రంలోని 135 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 173 మండలాల్లో వడగాల్పులకు ఆస్కారం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

పొంచి ఉన్న వడదెబ్బ ముప్పు..
ఇక, వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే, వ్యాధులు సోకే అవకాశం కూడా ఉంది. అందుకే వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. వేసవిలో చెమట ఎక్కువ పడుతుంది. సాధ్యమైనంత వరకు ప్రతీ ఒక్కరు 4 నుంచి 5 లీటర్ల నీటిని తీసుకోవాలి. కూల్ డ్రింక్స్ కు బదులుగా మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని సూచించారు. ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వారు నిమ్మరసం తీసుకోవడం మంచిదన్నారు.

Also Read..Karnataka: కాంగ్రెస్‌ను గెలిపించిన “అతడు”.. తెలంగాణలోనూ గెలిపిస్తాడా?.. ఎవరీ శక్తిమంతుడు?

వేసవిలో పాటించాల్సిన జాగ్రత్తలు..
వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం కర్బూజ, కీరా దోస.. ఇలా నీరు అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి. సాధ్యమైనంతవరకు నల్లటి దుస్తులు ధరించొద్దు. బాగా వదులుగా ఉండే దుస్తులే ధరించాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే తప్ప సాధ్యమైనంతవరకు ఇంటి పట్టునే ఉండటం మంచిది. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే ఉదయం 11 గంటల లోపు పనులు పూర్తి చేసుకోవాలి. బయటకు వెళ్లే వారు ఎండ నుంచి రక్షణ కోసం కూలింగ్ గ్లాసెస్, టోపీ, హెల్మెట్, గ్లౌజ్ లు వాడాలి. బయటికి వెళ్లే ముందు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. మసాలతో వండిన ఆహారానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించారు.