Karnataka: కాంగ్రెస్‌ను గెలిపించిన “అతడు”.. తెలంగాణలోనూ గెలిపిస్తాడా?.. ఎవరీ శక్తిమంతుడు?

Karnataka Elections 2023: ఇక ప్రశాంత్ కిశోర్‌ను మర్చిపోవాల్సిందేనా?

Karnataka: కాంగ్రెస్‌ను గెలిపించిన “అతడు”.. తెలంగాణలోనూ గెలిపిస్తాడా?.. ఎవరీ శక్తిమంతుడు?

Sunil Kanugolu

Sunil Kanugolu: భారత్‌లో ఎన్నికల వ్యూహకర్త అనగానే మొదట గుర్తుకువచ్చేది ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor). 2019 నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ని, 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీని, అదే ఏడాది జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి గెలిపించారు పీకే.

ఆ తర్వాత ఇకపై రాజకీయ వ్యూహకర్తగా ప్రత్యక్షంగా పనిచేయబోనని పీకే ప్రకటన చేశారు. అప్పటి వరకు దేశంలో పీకే పేరు మారుమోగిపోయింది. అయితే, అదంతా నిన్న… ఇప్పుడు సునీల్ కనుగోలు పేరు మారుమోగిపోతోంది. కీలకమైన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు సునీల్ కనుగోలు (Sunil Kanugolu).

అప్పట్లో ఇద్దరిదీ ఒకే టీమ్..

ప్రశాంత్ కిశోర్, సునీల్ కనుగోలు 2014 ఎన్నికల్లో ఒకే టీమ్ లో పనిచేశారు. 2018లో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Elections 2023) బీజేపీ వ్యూహకర్తగా సొంతంగా పనిచేసిన సునీల్ కనుగోలు ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ వ్యూహకర్తగా పనిచేసి ఆ పార్టీని గెలిపించడంలో సక్సెస్ అయ్యారు.

జేడీఎస్ తో కలిసే అవసరం లేకుండానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సీట్లు సాధించేలా చేశారు. సునీల్ కనుగోలు ప్రస్తుతం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. గత ఏడాది మేలో సునీల్ కనుగోలు గురించి యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఓ కీలక ప్రకటన చేశారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ..

వచ్చే లోక్ సభ ఎన్నికల (Lok Sabha elections-2024)లో కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ లో సునీల్ కనుగోలును సభ్యుడిగా నియమించారు. ఆ ఎన్నికల టాస్క్ ఫోర్స్ లో కాంగ్రెస్ దిగ్గజ నేతలు పి.చిదంబరం, ముకుల్ వన్సీక్, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, ప్రియాంక గాంధీ, రణ్ దీప్ సుర్జేవాలా ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆఫర్ ను ప్రశాంత్ కిశోర్ తిరస్కరించిన అనంతరం సునీల్ కనుగోలు కాంగ్రెస్ తరఫున పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. 2016లో సునీల్ కనుగోలు తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే తరఫున పనిచేశారు. డీఎంకే ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ స్టాలిన్ ప్రభ బాగా పెరిగింది. తదుపరి ఎన్నికల్లో ఆయనను చూసే ప్రజలు ఓట్లేసి డీఎంకేను గెలిపించారు.

అనంతరం 2018 ఫిబ్రవరి వరకు బీజేపీ నేత, కేంద్ర మంత్రి అమిత్ షాతో కలిసి సునీల్ కనుగోలు పనిచేశారు. సునీల్ టీమ్ లో 300 మంది ఉన్నారని అంచనా. వారితో కలిసి బీజేపీ తరఫున పనిచేసి గత ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక (2018)లో ఎన్నికల్లో సునీల్ కనుగోలు పనిచేశారు. ఆ పార్టీ విజయం వెనుక ఆయనే ఉన్నారు.

ఇక ఫోకస్ అంతా తెలంగాణపై..

తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తరఫున సునీల్ కనుగోలు పనిచేస్తున్నారు. ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ను గెలిపించేలా ఎన్నో కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఇటీవల సునీల్ టీమ్ టీం పొంగులేటి, జూపల్లితోనూ చర్చలు జరిపింది. కాంగ్రెస్ లో చేరాలని కోరింది.

సునీల్ టీమ్ తెలంగాణ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తోందని ఇటీవల కేసు కూడా పెట్టిన విషయం తెలిసిందే. కర్ణాటక ఎన్నికలు ముగియడంతో సునీల్ ఇక తెలంగాణ ఎన్నికలపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారు. కర్ణాటకలో అనుసరించిన ఫార్ములా సక్సెస్ అవడంతో దాన్నే తెలంగాణలోనూ అనుసరించే అవకాశం ఉంది.

ప్రశంసల జల్లు..
కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అరవింద్ గుణశేఖర్ అనే జర్నలిస్టు సునీల్ కనుగోలు గురించి చేసిన ట్వీటును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రీట్వీట్ చేశారు. సునీల్ కనుగోలు వ్యూహమే కాంగ్రెస్‌ ను అధికారంలోకి తెచ్చిందని అందులో ఉంది. ప్రచారంలో PayCM మొదలుకొని 5 హామీల వరకు ప్రజలను కాంగ్రెస్ కు బాగా దగ్గరచేశాయన్నది ఆ ట్వీట్ సారాంశం. కర్ణాటకలో కాంగ్రెస్ బలపడడం, సమష్టి నాయకత్వం ఎన్నికల ప్రచారానికి మరింత జోష్ ఇచ్చాయని అందులో ఉంది.

Revanth Reddy : నిన్న హిమాచల్, నేడు కర్నాటక, రేపు తెలంగాణ, ఆ తర్వాత ఢిల్లీ- రేవంత్ రెడ్డి ధీమా