Shameerpet Gun Firing
Shameerpet Gun Firing – Manoj : హైదరాబాద్ శామీర్ పేట్ లో సంచలనం రేపిన కాల్పలు కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కొత్త కోణం బయటపడింది. మనోజ్, స్మితల ఘరానా మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఇద్దరు మహా ముదుర్లు అని పోలీసుల విచారణలో తేలింది. సినిమాల్లో ఛాన్సుల పేరుతో అందమైన, డబ్బున్న అమ్మాయిలను ట్రాప్ చేసి డబ్బులు దండుకున్నట్లు గుర్తించారు.
అందమైన అమ్మాయిలను ట్రాప్ చేయడం, సినిమాల్లో అవకాశాల పేరుతో మోసం చేయడం.. ఇదీ మనోజ్, స్మితల తీరు. ఇటీవలే విజయవాడకు చెందిన ఓ సంపన్న కుటుంబం యువతికి ఈ కంత్రీ జంట వల వేసింది. ఆ ఫ్యామిలీని బెదిరించి రూ.50 లక్షలు వసూలు చేసింది మనోజ్-స్మిత జంట.
స్మిత ఒరాకిల్ ఉద్యోగినిగా పని చేస్తూనే మోసాలకు తెరలేపింది. కాల్స్ చేసి ట్రాప్ చేయడమే కాదు మెయిల్స్ హ్యాకింగ్ కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. స్మిత-మనోజ్ అక్రమాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
శామీర్ పేట్ కాల్పుల ఘటనలో మరో ట్విస్ట్ నెలకొంది. పోలీసుల విచారణలో మనోజ్-స్మితల మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సినిమాల్లో యాక్టింగ్ అవకాశాల పేరుతో మోసాలు చేస్తూ అందమైన అమ్మాయిలను మనోజ్-స్మిత జంట ట్రాప్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
శామీర్ పేట్ సెలెబ్రిటీ రిసార్ట్ లో జరిగిన కాల్పుల ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాఫ్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో కాల్పులు జరిపిన మనోజ్, స్మిత, సిద్ధార్ధ్ దాస్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 2003లో సిద్ధార్ధ్-స్మితకు వివాహం జరిగింది. 2019లో ఇద్దరూ విడిపోయారు. కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులకు పిటిషన్ వేశారు స్మిత. విడాకులు మంజూరు అయ్యాక బిజినెస్ పార్టనర్ గా ఉన్న మనోజ్ తో స్మిత సహజీవనం చేస్తున్నారు. సెలెబ్రిటీ రిసార్ట్ లోని ఒక విల్లాలో వీరు ఉంటున్నారు.
ఇటీవలి కాలంలో మనోజ్ తనను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడని సిద్ధార్ధ్ కొడుకు ఫిర్యాదు చేశాడు. దాంతో మనోజ్, స్మితలతో మాట్లాడేందుకు సిద్ధార్ధ్ రిసార్ట్ కు వెళ్లాడు. మనోజ్, సిద్ధార్ధ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తన దగ్గరున్న ఎయిర్ గన్ తో మనోజ్ కాల్పులు జరపడం కలకలం రేపింది. కాల్పుల శబ్దం విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గన్ ని సీజ్ చేశారు. స్మిత-మనోజ్ కొంతకాలంగా బిజినెస్ పార్టనర్స్ గా ఉంటున్నారు. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. మనోజ్-స్మితకు వివాహేతర సంబంధం ఉందని ఎలా అంటారు? అని మనోజ్ తండ్రి మండిపడ్డాడు. స్మిత కేవలం బిజినెస్ పార్టనర్ మాత్రమే అని చెప్పాడు. తన కొడుకు మనోజ్ దగ్గర ఆమె పని చేస్తుందని వివరించాడు. అంతకుమించి మనోజ్-స్మిత మధ్య ఎలాంటి సంబంధం లేదని ఆయన వాదిస్తున్నాడు.
సిద్ధార్ధ్ వెర్షన్ మాత్రం మరోలా ఉంది. మనోజ్-స్మిత ఇద్దరూ కలిసి ఉంటున్నారని, వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. సిద్ధార్ధ్ వైజాగ్ లోని ఒక కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్నాడు. మరోవైపు సిద్ధార్ధ్ కొడుకు కూడా మనోజ్ పై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. మనోజ్ తన తల్లిని లోబర్చుకున్నాడని, తనను తీవ్రంగా వేధిస్తున్నాడని సిద్ధార్ధ్ కొడుకు వాపోయాడు.