Liquor
Liquor Prices Hiked : మందుబాబులకు షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. బీర్ల ధరలను ప్రభుత్వం పెంచింది. 15శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. జైస్వాల్ కమిటీ సిఫార్సుల మేరకు బీర్ల ధరలు పెంచింది ప్రభుత్వం.
బీర్ల ధరలు సవరించాలని యునైటెడ్ బేవరేజస్, మరికొన్ని బేవరేజస్ గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ దీనిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ధరలు సవరించాలని బేవరేజస్ కంపెనీలు కోరుతున్న డిమాండ్లను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ ముందు ఉంచారు.
అయితే, ఎట్టిపరిస్థితుల్లో బేవరేజస్ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని ముఖ్యమంత్రి వారితో తేల్చి చెప్పారు. ఈ అంశంపై ఒక కమిటీ వేశారు. ఆ ప్రైస్ ఫిక్సింగ్ కమిటీ సిఫార్సుల మేరకే బీర్ల ధరలను 15శాతం పెంపు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, ధరలను 33శాతం పెంచాలని, లేదంటే బీర్ల సప్లయ్ ను కూడా ఆపేస్తామని యునైటెడ్ బేవరేజస్ గతంలో చెప్పింది.
Also Read : తెలంగాణలో ఉపఎన్నికలు ఖాయమేనా? ఆ ఎమ్మెల్యేలపై అనర్హతకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందా?
ఏపీలోనూ మద్యం ధరలు పెంపు..
అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వం మద్యం ధరలను పెంచింది. మద్యం షాపుల మార్జిన్ ను 14శాతానికి పెంచింది. 99 రూపాయల క్వార్టర్, బీర్ల ధరల మినహా మద్యం ధరలు పెరగనున్నాయి. బాటిల్ పై 10 రూపాయలు పెరుగుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.