Sircilla Constituency: సిరిసిల్లలో కేటీఆర్‌ను ఢీకొట్టేందుకు విపక్షాలు వేస్తున్న ఎత్తులేంటి.. బీజేపీ నుంచి పోటీచేసేదెవరు?

సిరిసిల్లలో కేటీఆర్‌ని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు రచిస్తున్నా.. అవేవీ పనిచేయడం లేదు. సిరిసిల్లలో కనిపిస్తున్న అభివృద్ధి ఫలితాల ముందు ప్రత్యర్థుల ఎత్తులన్నీ పటాపంచలైపోతున్నాయ్.

Sircilla Assembly Constituency Ground Report

Sircilla Assembly Constituency: సిరిసిల్ల.. మంత్రి కేటీఆర్(KTR) ఇలాఖా. ఇక్కడ వరుస విజయాలు సాధిస్తూ.. విపక్షాలకు స్థానం లేకుండా చేస్తున్నారు. దాంతో.. కేటీఆర్‌ని ఓడించడమే లక్ష్యంగా.. ప్రతిపక్ష్యాలు చేస్తున్న వ్యూహాలు ప్రతి ఎన్నికల్లోనూ బెడిసికొడుతున్నాయ్. ఇందుకు.. సిరిసిల్లను అభివృద్ధికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దడమే కారణమనే టాక్ కూడా ఉంది. అందుకే.. ఇక్కడి ఓటర్లు కూడా కేటీఆర్‌కే పట్టం కడుతున్నారు. అయితే.. కాంగ్రెస్ తరఫున వరుసగా పోటీ చేస్తున్న కేకే మహేందర్ రెడ్డి(KK Mahender Reddy).. కేటీఆర్‌కు ప్రత్యర్థిగా నిలుస్తూ వస్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ (BJP) నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. మరి.. అభివృద్ధితో సవాల్ చేస్తున్న కేటీఆర్‌ను ఢీకొట్టేందుకు విపక్షాలు వేస్తున్న ఎత్తులేంటి? సిరిసిల్లలో కేటీఆర్ బరిలో ఉంటే వార్ వన్ సైడేనా?

సిరిసిల్ల.. ఆ పేరు చెప్పగానే.. నేతన్నలు గుర్తుకొస్తారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించింది ఈ ప్రాంతం. 2009 ఎన్నికల్లో ఇక్కడ పాతుకుపోయిన గులాబీ జెండా.. ఇప్పటికీ అలాగే ఎగురుతోంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఎన్నికల్లో మంత్రి కేటీఆర్‌కు భారీ మెజారిటీతో పట్టం కడుతున్నారు సిరిసిల్ల ప్రజలు. దాంతో.. ఇక్కడ మరో పార్టీకి అవకాశం లేకుండా పోతోంది. ఇందుకు.. కేటీఆర్ తన మార్క్ అభివృద్ధితో.. సిరిసిల్ల రూపురేఖల్ని మార్చేయడమే కారణమంటున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే.. కేటీఆర్ లేని సిరిసిల్లను ఊహించలేమంటున్నారంటే ఇక్కడ ఆయన ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Minister KTR

సిరిసిల్ల నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో తొలిసారి ఇక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కేటీఆర్ విజయం సాధించారు. అప్పుడు కేవలం 171 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై గెలిచారు. తర్వాత.. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఒకప్పుడు సిరిసిల్ల అంటే నియోజకవర్గ కేంద్రం మాత్రమే. ఇప్పుడదే సిరిసిల్ల.. రాజన్న సిరిసిల్ల జిల్లాగా మారింది. ఇక.. బతుకమ్మ చీరల తయారీ పూర్తిగా సిరిసిల్ల నేతన్నలకే అప్పజెబుతుండటంతో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి మేరకు.. ఇక్కడి నుంచి కేటీఆర్ వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇక.. రాబోయే ఎన్నికల్లోనూ కేటీఆర్ వరుసగా ఐదోసారి గెలవడం ఖాయమంటోంది గులాబీదళం.

ఇక.. సిరిసిల్లలో జరిగిన అభివృద్ధిపైనా చర్చ జరుగుతోంది. మౌలిక వసతుల కల్పనపైనే కేటీఆర్ దృష్టి పెట్టారు. నర్సింగ్ కాలేజీతో పాటు గంభీరావుపేటలో కేజీ టు పీజీ స్కూల్‌ని, జయశంకర్ అగ్రికల్చర్ విద్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు శంకుస్థాపన చేశారు. ఇక.. సిరిసిల్లకు కాళేశ్వరం జలాలు అందించేందుకు నిర్మిస్తున్న 9వ ప్యాకేజీ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ప్రజల దయ ఉంటే.. మళ్లీ గెలుస్తానని.. కేటీఆర్ చెబుతున్నారు.

KK Mahender Reddy

సిరిసిల్లలో కేటీఆర్‌ని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు రచిస్తున్నా.. అవేవీ పనిచేయడం లేదు. సిరిసిల్లలో కనిపిస్తున్న అభివృద్ధి ఫలితాల ముందు ప్రత్యర్థుల ఎత్తులన్నీ పటాపంచలైపోతున్నాయ్. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న కేకే మహేందర్ రెడ్డి ప్రతి ఎన్నికల్లో కేటీఆర్‌కు ప్రత్యర్థిగా నిలుస్తూ వస్తున్నారు. 2009 నుంచి కేటీఆర్‌పై పోటీ చేస్తున్న మహేందర్ రెడ్డి కొంతకాలంగా కాంగ్రెస్‌లో సైలెంట్ అయ్యారు. నియోజకవర్గంలోనూ పెద్దగా కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు. దాంతో.. కాంగ్రెస్ క్యాడర్ అంతా అయోమయానికి గురవుతోంది. ఓ వైపు రాష్ట్రంలో హస్తం పార్టీ దూకుడుగా వెళుతుంటే.. సిరిసిల్లలో మాత్రం గ్రాఫ్ పడిపోతోందనే వాదన వినిపిస్తోంది. పరిస్థితులు ఎలా ఉన్నా ఈసారి సిరిసిల్లలో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్నారు కేకే మహేందర్ రెడ్డి.

Also Read: కరీంనగర్ లో కాంగ్రెస్ పూర్వవైభవం సాధిస్తుందా.. గంగుల ప్రత్యర్థి ఎవరు.. బండి మళ్లీ అసెంబ్లీకి పోటీచేస్తారా?

Lagishetty Srinivas

బీజేపీ విషయానికొస్తే.. ఆ పార్టీ నుంచి ఇక్కడ కేటీఆర్‌పై బరిలోకి దిగేందుకు బలమైన అభ్యర్థులు లేరు. మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, రెడ్డబోయిన గోపి, అడ్వకేట్ రమాకాంత్ రావు.. టికెట్ ఆశిస్తున్నారు. అయితే.. చేనేత సామాజికవర్గానికి చెందిన లగిశెట్టి శ్రీను (Lagishetty Srinivas)ని బరిలోకి దించితే.. నేతన్నల ఓట్ బ్యాంక్ అనుకూలంగా మారుతుందనే లెక్కలు వేసుకుంటోంది బీజేపీ.

Also Read: జగిత్యాలలో ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీకి దిగుతున్నారు.. పార్టీలు వేస్తున్న లెక్కలేంటి?

సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలో రెండు లక్షల 8 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. వీరిలో నేతన్నల ఓట్ బ్యాంక్ 22 వేలకు పైనే ఉంది. వాళ్లే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఆ తర్వాత.. గౌడ, మున్నూరు కాపు, ముదిరాజ్, రెడ్డి సామాజికవర్గాలు.. అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపుతాయి. ఇక.. నేత కుటుంబాల ఓట్లకు గాలం వేయడం మీదే పార్టీలు ఫోకస్ పెట్టాయి. ప్రభుత్వం కూడా నేతన్నలకు వరాలు ప్రకటిస్తూ.. వారికి చేయూత అందిస్తుండటంతో వాళ్లంతా గులాబీ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలిచే మొదటి స్థానం సిరిసిల్ల అంటున్నారు. ఈసారి కేటీఆర్‌కు ఎంత మెజారిటీ వస్తుందనే దానిమీదే లెక్కలేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో.. విపక్షాల ఎఫెక్ట్ ఎంత ఉంటుందనేది.. ఎన్నికల తర్వాతే తెలుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు