తెలంగాణపై కరోనా పంజా విసురుతోంది. కరోనా కాటుకు మరో ఆరుగురు తెలంగాణ వాసులు చనిపోయారు.
తెలంగాణపై కరోనా పంజా విసురుతోంది. కరోనా కాటుకు మరో ఆరుగురు తెలంగాణ వాసులు చనిపోయారు. మృతులంతా ఈనెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్‌లో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అక్కడే వీరికి కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తోంది. అయితే వీరంతా తెలంగాణకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా చనిపోయారు. మత ప్రార్థనల్లో పాల్గొన్న ఇద్దరు గాంధీలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు.
మరొకరు అపోలో ఆస్పత్రిలో, ఇంకొకరు గ్లోబల్ ఆస్పత్రిలో చనిపోయారు. అంతేకాదు.. నిజామాబాద్, గద్వాలలోనూ ఒక్కొక్కరు మృతి చెందారు. అయితే వీరందరూ… కరోనా సోకిందని తెలియకముందే చనిపోయారు. మూడు రోజుల క్రితం ఖైరతాబాద్‌లో కరోనాతో చనిపోయిన వృద్ధుడు కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఖైరతాబాద్ వృద్ధుడికి కూడా చనిపోయే ముందు కరోనా ఉన్నట్టు తెలియలేదు. ఆ తర్వాత కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. మిగతా వారు కూడా అదే రీతిలో చనిపోయినట్లు తెలుస్తోంది.
కరోనాతో ఆరుగురు చనిపోయారన్న సమాచారంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మృతుల కుటుంబాలకు కరోనా పరీక్షలు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. మృతుల కుటుంబ సభ్యులతోపాటు.. మృతులు కలిసిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించనుంది. మృతుల కుటుంబాలకు చెందిన వారు విధిగా సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాలని అధికారులు కోరారు. అంతేకాదు.. ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వారంతా తమ సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
See Also | ఏపీలో 23కు చేరిన కరోనా కేసులు..మరో ఇద్దరికి పాజిటివ్