Heavy Rains: తెలంగాణలో నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. మూడు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ..

Heavy Rains
Telangana Rains: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rains) కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షం కురుస్తోంది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. చెరువులు, వాగులు, వంకలు, పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. చాలాచోట్ల రోడ్లు, కాలనీలపైకి వరదనీరు చేరడంతో జనజీవనం అతలాకుతలమైంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ఉత్తర తెలంగాణలో 17వ తేదీన వర్షపాతం అధికంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఈ జిల్లాల్లో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నిటికీ సెలవు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..
సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్, హనుమకొండ, అదిలాబాద్, జనగామ, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్ధిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.