Rajalingamurthy: మేడిగడ్డపై కేసీఆర్, హరీశ్ మీద కేసు వేసిన వ్యక్తి దారుణ హత్య.. భూ వివాదమే కారణం

భూపాలపల్లిలో లింగమూర్తి హత్య ఘటనను రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. లింగమూర్తి హత్య ఘటనపై సీబీసీఐడీ విచారణకు

Rajalingamurthy

Rajalingamurthy:  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మాజీ కాన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్య సంచలనం సృష్టించింది. రెడ్డికాలనీ వద్ద మాటువేసి రాజలింగమూర్తిపై దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. నలుగురు కలిసి హత్య చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రగాయాలతో పడిఉన్న రాజలింగమూర్తిని హుటాహుటీన అంబులెన్సులో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాజలింగమూర్తి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

 

రాజలింగమూర్తి హత్యకు భూ వివాదమే కారణమై ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హంతకులను పట్టుకునే వరకు అంత్యక్రియలు కూడా చేయమని మృతిని భార్య, కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. ఇదిలాఉంటే.. రాజలింగమూర్తి సామాజిక కార్యకర్తగా అనేక సమస్యలపై ఉద్యమించేవారని స్థానికులు చెబుతున్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందని గతంలో కేసీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురిపై రాజలింగమూర్తి న్యాయ పోరాటం చేస్తున్నాడు. భూపాలపల్లి కోర్టులో ప్రైవేటు పిటీషన్ వేశాడు.

 

తాజా.. రాజలింగమూర్తి హత్య కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు.. అతని హత్యకు భూ వివాదమే కారణమని గుర్తించినట్లు తెలిసింది. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఎకరం భూమి విషయంలో రేణుకుంట్ల కొమరయ్య, సంజీవ్ తో రాజలింగమూర్తికి వివాదం ఉంది. ఈ భూమి కేసు కోర్టు పరిధిలో ఉంది. రాజలింగమూర్తికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చే సంకేతాలు ఉండడంతో కాపుకాసి నలుగురు దుండగులు హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. రాజలింగమూర్తి హత్యకు సంబంధించిన కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న దుండగులకోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

ఇదిలాఉంటే.. భూపాలపల్లిలో లింగమూర్తి హత్య ఘటనను రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. లింగమూర్తి హత్య ఘటనపై సీబీసీఐడీ విచారణకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. మేడిగడ్డ అవినీతిపై పోరాడుతున్నందుకే హత్య చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.