ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌ ప్రతినిధుల వేధింపులు భరించలేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

Software engineer commits suicide : ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌లు మరొకరి ప్రాణాలు తీశాయి. 70 వేల రూపాయలు అప్పు తీర్చలేక, ఆన్‌లైన్‌ లోన్ యాప్‌ ప్రతినిధుల వేధింపులు భరించలేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌ శివార్‌లోని రాజేంద్రనగర్‌ కిస్మాత్‌పూర్‌లో జరిగింది.

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సునీల్‌ ఇన్‌స్టంట్‌ లోన్‌లో 70వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. దీంతో అతడిని అప్పు తీర్చాలంటూ లోన్‌ యాప్‌ ప్రతినిధులు తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. ఒక బాకీ తీర్చేందుకు మరో యాప్‌లో లోన్ తీసుకున్నాడు సునీల్‌. ఇలా చూస్తూ చూస్తూ అప్పుల ఊబిలోకి కూరుకుపోయాడు. 70 వేలు అప్పు కట్టకపోవడంతో సునీల్ తల్లికి ఫోన్ చేసి బెదిరింపులు రావడం మొదలయ్యాయి.

దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సునీల్‌.. తన ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆన్‌లైన్ లోన్ యాప్ ప్రతి నిధుల వేధింపులతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నడంటూ మృతుడి భార్య రమ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.