Sonia as Bharatmata: తమ పార్టీ అధినేతలను పొగడడం భారత రాజకీయాల్లో ఉన్న ఆనవాయితీ. పొగడ్తలను మించి కొన్ని సార్లు మరింత ఎక్కువకు పోతుంటారు. ఎలా అంటే.. తమ పార్టీ నాయకుడిని అభినవ అంబేద్కరుడనో, మరో గాంధీ అనో అంటుంటారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇలాంటి ఫీటే వేశారు. ఆ పార్టీ మాజీ అధినేత సోనియా గాంధీని ఒక్కసారిగా భారతమాతను చేశారు. ఆదివారం రంగారెడ్డి జిల్లాలోని తక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సహా సోనియా, రాహుల్, ప్రియాంక ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు.
అయితే వీరందరితో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లోనే సోనియాను భారతమాతగా చిత్రించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజెన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు, శాసనసభా పక్ష నేతలు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఇక గతంలో ఒకసారి కూడా ఇలా జరిగింది. సోనియా గాంధీని తెలుగు తల్లిగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన శంకర్ రావు అనే కాంగ్రెస్ పార్టీ నేత విగ్రహాన్ని తయారు చేశారు. 2014లో ఈ విగ్రహాన్ని రూపొందించారు. అంతటితో ఆగకుండా సోనియాకు గుడి సైతం కడతానంటూ ఆయన అప్పట్లోనే ప్రకటించారు. కానీ వాస్తవంలో అది కార్యరూపం దాల్చలేదు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే.