Soyam Bapurao: నేను అలా అనలేదు.. మా పార్టీ నేతలే కుట్ర పన్ని అలా ప్రచారం చేశారు: బీజేపీ ఎంపీ సోయం బాపూరావు
దీనిపై సోయం బాపూరావు స్పష్టతనిచ్చారు. తనపై సొంత పార్టీ నేతలు కుట్ర చేశారని అన్నారు.
- T Venkateshwarlu
- Published On : June 19, 2023 / 04:42 PM IST
Soyam Bapurao
Soyam Bapu Rao – BJP: సొంత పార్టీ నేతలపై ఆదిలాబాద్ (Adilabad) ఎంపీ, బీజేపీ నేత సోయం బాపూరావు మండిపడ్డారు. తన సొంత అవసరాల కోసం ఎంపీ లాడ్స్ (MPLADS) నిధులను వాడుకున్నానంటూ సోయం బాపూరావు స్వయంగా చెప్పినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
దీనిపై సోయం బాపూరావు స్పష్టతనిచ్చారు. తనపై సొంత పార్టీ నేతలు కుట్ర చేశారని అన్నారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు గోల్మాల్ చేశానని ఆ ఇద్దరు బీజేపీ నేతలు తనను బద్నాం చేశారని తెలిపారు.
ఆదివాసీ బిడ్డ అయిన తన ఉన్నతిని ఓర్వలేకే వారు కుట్రలు పన్నుతున్నారని చెప్పుకొచ్చారు. గతంలో ఆదిలాబాద్ లో బీజేపీ లేదని, తాను ఆ పార్టీలో చేరిన తర్వాతే జిల్లాలో పార్టీ బలోపేతం అయిందని తెలిపారు. జిల్లాలో పార్టీ ఎదుగుదలకు తాను చాలా కష్టపడ్డానని అన్నారు. అటువంటి తన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. తాను ఎంపీ లాడ్స్ నిధులను దుర్వినియోగం చేయలేదని అన్నారు.
