×
Ad

Panchayat Elections: మోగిన ఎన్నికల నగారా.. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది.

Panchayat Elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్.. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం మూడు దఫాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 11న తొలి విడత పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 14న ఫేజ్ 2, డిసెంబర్ 17న మూడో విడత పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది.

అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలు వెల్లడిస్తారు. అదే రోజున ఉప సర్పంచ్ ని గ్రామ వార్డు సభ్యులు ఎన్నుకోనున్నారు. ఈరోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. ఈ నెల 27 నుంచి తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. మొత్తం 31 జిల్లాల పరిధిలో 545 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 12వేల 760 పంచాయతీలు (సర్పంచ్ స్థానాలు), ఒక లక్ష 12వేల 534 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో గ్రామీణ ఓటర్ల సంఖ్య 1,66,55,186.

తొలి దశలో 4వేల 200 సర్పంచ్‌ స్థానాలకు.. 37వేల 440 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తాం. నవంబర్‌ 27 నుంచి తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నామినేషన్లు స్వీకరిస్తాం. రెండో విడత ఎన్నికలకు ఈ నెల 30 నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్‌ 3 నుంచి నామినేషన్లు స్వీకరిస్తాం. రెండో విడతలో 4వేల 333 సర్పంచ్‌ స్థానాలకు.. 38వేల 350 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. మూడో విడతలో 4వేల 159 సర్పంచ్‌ స్థానాలకు.. 36,452 వార్డులకు పోలింగ్‌ నిర్వహిస్తాం” అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వివరించారు.

Also Read: ఆ ఒక్క మెయిల్ తో.. ఐబొమ్మ రవిని పట్టేశాం.. కీలక విషయాలు చెప్పిన పోలీసులు..