Rythu Bharosa Funds : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. 2 ఎకరాల వరకు నిధులను రిలీజ్ చేసింది సర్కార్. ఒక్కొక్కరికి 6వేల రూపాయల చొప్పున మొత్తం 8.65 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో 707.54 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఇప్పటికే ఎకరం పొలం ఉన్న 17 లక్షల మంది రైతులకు రూ.557 కోట్లు, 557 పైలట్ గ్రామాలకు చెందిన వారికి రూ.568 కోట్లు జమ చేసింది ప్రభుత్వం.
మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 30.11 లక్షల మంది రైతులకు రూ.1834.09 కోట్లు జమయ్యాయి. కాగా, అర్హత ఉన్నా.. డబ్బులు జమ కాని రైతులు సంబంధిత ఏఈవో లేదా ఏవోను సంప్రదించాలని అధికారులు సూచించారు.
Also Read : తెలంగాణ గట్టుపై మినీ ఎన్నికల సమరం ఖాయమేనా? ఆ ఎమ్మెల్యేలపై అనర్హతకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందా?
రైతు భరోసా స్కీమ్ కింద పంట పెట్టుడి సాయంగా డబ్బులు జమ చేస్తోంది ప్రభుత్వం. ఎకరానికి 12 వేల రూపాయలు సాయంగా ఇస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద 10వేలు ఇచ్చింది. అదీ రెండు విడతల్లో. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్నే రైతు భరోసాగా మార్చి అదనంగా 2 వేల రూపాయలు ఇస్తోంది. 12 వేల రూపాయలు 2 విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. సాగులో ఉన్న భూములకే ఈ సాయం.
రైతు భరోసా కింద ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు ఫిబ్రవరి 5న తొలి విడతలో ఫండ్స్ రిలీజ్ చేసింది సర్కార్. 17.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. ఇప్పుడు రెండు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు నిధులు విడుదలయ్యాయి. ఇలా.. విడతల వారీగా మార్చి 31 వరకు అర్హులైన రైతులందరికీ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ఇదివరకే ప్రభుత్వం తెలిపింది.