Dog Attack : తల్లిదండ్రుల వెన్నులో వణుకుపుట్టించే ఘటన.. దయచేసి మీ పిల్లలను ఒంటరిగా వదలొద్దు..

Dog Attack : తమ పిల్లలను వీధుల్లోకి ఒంటరిగా వదిలిపెట్టే సాహసం చేస్తున్న తల్లిదండ్రులకు ఇదో హెచ్చరిక. ఇక ముందు పిల్లలను ఒంటరిగా బయటకు వదలొద్దు. కచ్చితంగా వారి వెనుక ఎవరో ఒకరు ఉండేలా చూసుకోండి. పిల్లల పట్ల మరింత అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే, బయటకు వెళ్లిన అభం శుభం తెలియని చిన్నారులు ఊహించని ప్రమాదంలో చిక్కుకోవచ్చు. అందుకు నిదర్శనం నాగర్‌కర్నూలు జిల్లాలో జరిగిన దారుణమే.

నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలో నాలుగేళ్ల చిన్నారి నందిని వీధిలో ఒంటరిగా నడిచి వస్తుండగా సడెన్ గా వీధి కుక్క దాడి చేసింది. చిన్నారిని రోడ్డు పక్కకు లాక్కెళ్లింది. స్థానిక బస్‌డిపో ముందు కాలనీలో నడుచుకుంటూ వెళ్తుండగా వీధి కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడి దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ దృశ్యాలు అందరిని కలచివేస్తున్నాయి.

కుక్క దాడి చేయడంతో చిన్నారి గట్టిగా అరిచింది. ఆ అరుపులకు స్థానికులు వచ్చి కాపాడారు. వెంటనే చిన్నారిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కుక్క దాడిలో చిన్నారి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మున్సిపాలిటీ అధికారులు స్పందించి వెంటనే కుక్కలు, పందుల స్వైరవిహారాన్ని అరికట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కాగా, తమ చిన్నారులను ఒంటరిగా బయటకు వదిలే తల్లిదండ్రులు ఇక ముందు మరింత జాగ్రత్తగా ఉండాలని, పిల్లల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన తెలియజెప్పింది.

ట్రెండింగ్ వార్తలు