Suryapet : సూర్యాపేట భార్యాభర్తల హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఇద్దరు కానిస్టేబుళ్లు.. అసలు విషయం ఇదే..
- Harish Thanniru
- Published on- August 14, 2026 / 08:57 AM IST
Suryapet Double Murder Case
Suryapet Double Murder Case : సూర్యాపేట జిల్లాలో భార్యాభర్తల హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో పోలీస్ శాఖకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్ల ప్రమేయం ఉన్నట్లు తేలింది. మోతె పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు షరీఫ్, సుందరయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వివాహేతర సంబంధం, డబ్బుల వ్యవహారమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని బీక్యాతండాకు చెందిన హలావత్ బూబా, ఆమె భర్త నాగులు హత్యకు గురైన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు చేయగా.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూబాతో కానిస్టేబుల్ షరీఫ్‌కు గతంలో వివాహేతర సంబంధం ఉంది. బూబా కుమార్తె వివాహ సమయంలో షరీఫ్ ఆమెకు రూ.3లక్షలు అప్పుగా ఇచ్చాడని తేలింది.
ఇటీవల కాలంలో.. తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని బూబాపై షరీఫ్ ఒత్తిడి చేశాడు. దీంతో బూబా బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. డబ్బులు తిరిగి ఇవ్వకపోవటంతోపాటు.. వివాహేతర సంబంధం గురించి బయట పెడతానని బెదిరించింది. ఈ విషయం బయటకు వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన షరీఫ్.. ఆమెను హత్య చేయాలని నిర్ణయించాడు.
బూబాను హత్య చేసేందుకు తోటి కానిస్టేబుల్ సుందరయ్య సహకారం కోరాడు. అతను ఒప్పుకోవడంతో ఇద్దరు కలిసి బూబా, ఆమె భర్తను హత్య చేసేందుకు ప్లాన్ వేశారు. ప్లాన్‌లో భాగంగా పట్టుబడిన గంజాయిని పాతిపెట్టేందుకు గుంతలు తీయాలని చెప్పి భార్యాభర్తలను సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారి దగ్గరకు తీసుకెళ్లారు.
బూబా, ఆమె భర్త నాగులు గుంతలు తీస్తుండగా.. ఇద్దరు కానిస్టేబుళ్లు కలిసి రాడ్ తో బూబాను కొట్టడంతో ఆమె చనిపోగా.. నాగులుపైసైతం కర్రతో దాడి చేసి హత్య చేశారు. ఆ తరువాత ఇద్దరి మృతదేహాలను అక్కడే పాతిపెట్టినట్లు సమాచారం. దర్యాప్తులో విషయం బయటకు రావడంతో కానిస్టేబుళ్లు షరీఫ్, సుందరయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
