Site icon 10TV Telugu

Left Parties: కాంగ్రెస్‌తో కమ్యూనిస్టుల దోస్తీపై సస్పెన్స్.. తెలంగాణలో ఆసక్తికరంగా పొత్తు రాజకీయం

suspense continues on left parties alliance with telangana congress

suspense continues on left parties alliance with telangana congress

Left Parties – Telangana Congress: తెలంగాణలో పొత్తు రాజకీయం ఆసక్తికరంగా మారింది. అధికార బీఆర్‌ఎస్‌తో పొత్తు కుదరక ఒంటరైన కమ్యూనిస్టులు.. ఇప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్‌తో కలిసేందుకు తటపటాయిస్తున్నారు. ఉభయ కమ్యూనిస్టుల్లో ఒకరు కాంగ్రెస్‌తో చెలిమికి రెడీ అంటే.. మరొకరు ఆచితూచి అడుగులేద్దామని వెనక్కి లాగుతున్నారు. రెండు పార్టీలు చెరోవైపు లాగుతుండటంతో కాంగ్రెస్‌తో కమ్యూనిస్టుల దోస్తీపై సస్పెన్స్ ఏర్పడింది.. ఇంతకీ కాంగ్రెస్‌తో పొత్తుకు నై అంటున్నది ఎవరు.. సై.. సై అంటున్నది ఎవరు?

ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ.. తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యంగా అధికారమే టార్గెట్‌గా వ్యూహాలను పదునెక్కిస్తోంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్‌ఎస్-కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తు కుదరకపోవడంతో.. వామపక్షాలకు స్నేహ హస్తం చాస్తోంది కాంగ్రెస్ పార్టీ. జాతీయస్థాయిలో ఇండియా కూటమి భాగస్వాములైన కమ్యూనిస్టులతో రాష్ట్రంలోనూ కలిసి ముందుకెళ్దామని ప్రతిపాదిస్తోంది హస్తం పార్టీ. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్లు.. అధికార బీఆర్‌ఎస్‌ చేతిలో మోసపోయామని రగిలిపోతున్న కమ్యూనిస్టులను చేరదీసి.. సీఎం కేసీఆర్‌పై ప్రతికారం తీర్చుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ.

కాంగ్రెస్ ప్రతిపాదనతో కమ్యూనిస్టుల్లో కూడా చలనం వచ్చింది. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్‌తో పొత్తుకు సముఖంగా లేని వామపక్ష పార్టీల్లో.. ఒకటైన సీపీఐ పొత్తు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించింది. సీపీఎం మాత్రం ఇంతవరకు ఎలాంటి వైఖరిని తీసుకోలేదు. కొన్నాళ్లు వేచిచూశాకే నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది సీపీఎం నాయకత్వం. బీఆర్‌ఎస్ ఏకపక్ష ధోరణి వల్ల ఇప్పటికే నష్టపోయామని భావిస్తోన్న సీపీఎం.. తాము కోరినన్ని సీట్లు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం లేదన్న అనుమానంతో పొత్తు చర్చలను వాయిదా వేస్తోంది. సోమవారం మధ్యాహ్నం సీపీఎం నేతలతో చర్చలకు కాంగ్రెస్ సిద్ధమైనా.. మరికొంత సమయం కావాలని దాటవేసింది సీపీఎం. మరోవైపు ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతో తొలి విడత చర్చలు జరిపి పొత్తు దిశగా అడుగులు వేసింది సీపీఐ.

Also Read: కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు ఇస్తున్నారు.. గెలిచాక వారు బీఆర్ఎస్ లో చేరతారు

కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే చెరో నాలుగు సీట్లు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాయి కమ్యూనిస్టు పార్టీలు. కొత్తగూడెం, బెల్లంపల్లి, మునుగోడు, హుస్నాబాద్ కేటాయించాలని సీపీఐ.. మిర్యాలగూడ, నాగార్జునసాగర్, పాలేరు, భద్రాచలం సీట్లు ఇవ్వాలని సీపీఎం కోరుతున్నాయి. ఐతే కాంగ్రెస్ సీపీఐకి రెండు, సీపీఎంకి ఓ సీటు కేటాయించేందుకు సముఖత వ్యక్తం చేస్తోంది. సీపీఐకి మునుగోడు, హుస్నాబాద్, సీపీఎంకి మిర్యాలగూడ సీట్లు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. ఈ మూడు సీట్లు ఆ రెండు పార్టీలకు ఇవ్వడం వెనుక కాంగ్రెస్ మరో ప్రయోజనం ఆశిస్తోంది. మిర్యాలగూడకు సరైన నాయకత్వం లేనందున సీపీఎంకి వదిలేయడమే మేలన్నది ఓ కారణం కాగా, మునుగోడు, హుస్నాబాద్‌ల్లో ఇద్దరేసి నాయకులు టిక్కెట్ కోసం పోటీ పడుతున్నందున.. సీపీఐకి కేటాయించి అంతర్గత పోటీకి చెక్ చెప్పాలనుకుంటోంది.

Also Read: ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కు హైకోర్టులో చుక్కెదురు

హుస్నాబాద్లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. మునుగోడులో పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి పోటీపడుతున్నారు. వీరికి ప్రత్యామ్నాయం చూపి.. ఆ సీట్లను కమ్యూనిస్టులకు కేటాయించాలని చూస్తోంది కాంగ్రెస్. సీపీఐ కోరిన మరో రెండు సీట్లలో బెల్లంపల్లి నుంచి మాజీ మంత్రి గడ్డం వినోద్, కొత్తగూడెం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయనున్నందున తన వద్దే ఉంచుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. ఇక మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి పార్టీలో చేరితే ఆయనకు భువనగిరి నుంచి బరిలో దించాలని భావిస్తోంది. ఇక సీపీఎం అడిగిన సీట్లలో ఇప్పటికే బలమైన నేతలు ఉండటంతో ఒక్క మిర్యాలగూడ మాత్రమే ఆ పార్టీకి కేటాయించే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో సీపీఎం కాంగ్రెస్‌తో కలిసే విషయమై వెనక్కి తగ్గుతోంది. మొత్తానికి పొత్తు రాజకీయం ఒక అడుగు ముందుకి మరో అడుగు వెనక్కిలా మారింది.

Exit mobile version