Sydney Shooting incident
Sydney Shooting : ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం బోండీ బీచ్‌లో డిసెంబర్ 14న (ఆదివారం) కాల్పుల ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 15మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయాలతో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ కాల్పుల ఘటనను ఉగ్రదాడిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది.
హనుక్కా వేడుకల సందర్భంగా జరిగిన ఈ కాల్పులకు కారణమైన ఇద్దరు నిందితుల్లో ఒకరు హతమయ్యాడు. దాడికి పాల్పడిన వారిని సాజిద్ అక్రమ్(50), అతని కుమారుడు నవీద్ అక్రమ్ (24)గా ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. దాడికి ఐసీస్ భావజాల ప్రభావమే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేసినట్లు ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు.
ఆస్ట్రేలియాలో కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకడైన సాజిద్ అక్రమ్ (50) మృతి చెందాడు. అతని వద్ద భారత్ పాస్‌పోర్టు ఉన్నట్లు ఆస్ట్రేలియా అధికారులు గుర్తించారు. అతడు హైదరాబాద్ నుంచి పాస్‌పోర్టు పొందినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ డీజీపీ కార్యాలయం దీనిపై ప్రకటన విడుదల చేసింది. సాజిద్ అక్రమ్ హైదరాద్ వ్యక్తి అని వెల్లడించారు.
తెలంగాణ డీజీపీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్. ఇక్కడే బీకాం పూర్తి చేసి 1998లో ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. సాజిద్ అక్రమ్ వద్ద ఇప్పటికే భారత్ పాస్‌పోర్టు లభ్యమైంది. అస్ట్రేలియాలో యూరోపియన్ యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు నవీద్, కుమార్తె ఉన్నారు. వారిద్దరూ ఆస్ట్రేలియా పౌరులే. అతనికి గత 27ఏళ్లలో కుటుంబంతో పరిమిత సంబంధాలే ఉన్నాయి. తండ్రి మరణం సమయంలోకూడా అతను భారత్ రాలేదని సమాచారం. కేవలం కుటుంబ, ఆస్తుల సంబంధించిన వ్యవహారాల కోసమే ఇక్కడకు వచ్చాడు. రాడికలైజేషన్‌కు భారత్ లేదా తెలంగాణతో ఎలాంటి సంబంధం లేదని ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సాజీద్ అక్రమ్ పై 1998కి ముందు తెలంగాణలో ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని పోలీసులు నిర్దారించారు. అయితే, వాస్తవాలు నిర్దారణ కాకుండా ఊహాగానాలకు దూరంగా ఉండాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి విజ్క్షప్తి చేశారు.
ఆస్ట్రేలియాలో కాల్పులు జరిపిన సాజిత్ అక్రమ్ హైదరాబాద్ నుంచి పాస్‌పోర్టు పొందినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. సాజిత్ అక్రమ్ హైదరాబాద్ నుంచి ఫిలిప్పిన్స్, పాకిస్థాన్ వెళ్లినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు సాజిత్ కుటుంబ సభ్యుల వివరాల కోసం కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. పూర్తి వివరాలు సేకరించిన తరువాత సాజిత్ అక్రమ్ హైదరాబాద్ నుంచి ఏఏ దేశానికి వెళ్లాడు.. అనే వివరాలు తెలుస్తామని నిఘా వర్గాలు చెబుతున్నాయి.