Telangana Assembly : తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డికి షాక్.. మండలి నుంచి సస్పెన్షన్.. ఎప్పటివరకంటే?
Telangana Assembly : స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్సీలను ఈ సెషన్ మొత్తం మండలి నుంచి సస్పెండ్ చేశారు.
- Sreehari A
- Updated on- September 8, 2026 / 06:50 PM IST
Telangana Assembly Tata Madhu, Naveen Kumar Reddy
- స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మండలి నుంచి సస్పెండ్
- తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
- ఎమ్మెల్సీలపై తుది నిర్ణయం ఎథిక్స్ కమిటీలోనే
- ఈ వ్యవహారంపై శాసనసభలో తీర్మానం
Telangana Assembly : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, నవీన్‌కుమార్‌రెడ్డికి షాక్ తగిలింది. తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది. సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, సభా మర్యాదలకు విరుద్ధంగా వ్యవహరించడం, పోలీసులతో జరిగిన తోపులాటకు సంబంధించిన వివాదం నేపథ్యంలో ఇద్దరినీ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు.
సెప్టెంబర్ 7న అసెంబ్లీ ప్రాంగణంలోని గేట్ నంబర్ 3 సమీపంలో బీఆర్‌ఎస్ నేతలు, పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి సభాపతిని ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ అధికార పక్షం ఆరోపించింది. మహిళల సమక్షంలో అనుచితంగా ప్రవర్తించారని, చొక్కాలు విప్పి నిరసన వ్యక్తం చేశారని సభలో ప్రస్తావించారు. ఈ ఘటనను శాసనసభ గౌరవానికి భంగం కలిగించే చర్యగా ప్రభుత్వం అభివర్ణించింది.
శాసనసభలో తీర్మానం :
ఈ వ్యవహారంపై మంత్రి దామోదర రాజనర్సింహ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. సభాపతిపై చేసిన వ్యాఖ్యలను సభ తీవ్రంగా ఖండించింది. బీఆర్‌ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ తమ పార్టీ సభ్యుల ప్రవర్తనకు బాధ్యత వహించి సభాపతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరింది. అలాగే, ఇద్దరు ఎమ్మెల్సీలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని శాసనమండలి ఛైర్మన్‌ను కోరింది.
శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు తీర్మానం ఆధారంగా ఇద్దరు ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మూజువాణి ఓటింగ్ నిర్వహించారు. తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిని ఈ సెషన్స్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
తుది నిర్ణయం ఎథిక్స్ కమిటీలోనే :
అనంతరం ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయనున్నట్లు తెలిపారు. అయితే, ఇద్దరు ఎమ్మెల్సీలపై తుది నిర్ణయం ఎథిక్స్ కమిటీలోనే తీసుకోనున్నారు. ప్రస్తుత సస్పెన్షన్ తక్షణ క్రమశిక్షణ చర్య మాత్రమే.. తదుపరి చర్యలు, శిక్ష లేదా ఇతర నిర్ణయాలపై ఎథిక్స్ కమిటీ పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకోనుంది.
రెండు నిమిషాల్లోనే ముగిసిన మండలి :
ఈ పరిణామాల నేపథ్యంలో శాసనమండలి సమావేశం దాదాపు రెండు నిమిషాల్లోనే ముగిసింది. మరోవైపు, ఘటనపై నమోదైన కేసులో తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డికి కోర్టు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతుండగానే, సభా ప్రవర్తనకు సంబంధించిన అంశంపై శాసనసభ, శాసనమండలి తమ పరిధిలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాయి.
