TS Assembly Session 2023: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ అప్‌డేట్స్

నేడు ఉభయ సభల్లో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరిగింది. బిల్లుపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. అనంతరం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. బడ్జెట్‌ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి.

TS Assembly

TS Assembly Session 2023: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేటితో ముగిశాయి. నేడు ఉభయ సభల్లో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరిగింది. బిల్లుపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. అనంతరం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. బడ్జెట్‌ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 12 Feb 2023 05:07 PM (IST)

    శాసనసభ నిరవధిక వాయిదా

    ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభ నిరవధిక వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాలు మొత్తం 52.25 గంటల పాటు సాగాయి. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలిసారి నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు ఇవే.

  • 12 Feb 2023 04:52 PM (IST)

    మోదీ పాలనలో ఒక్క రంగంలోనైనా వృద్ధిరేటు ఉందా?

    ప్రధాని మోదీ ప్రభుత్వ పాలనలో ఒక్క రంగంలోనైనా వృద్ధిరేటు ఉందా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. మన దేశంలో చాలినంత నాణ్యమైన బొగ్గు ఉందని చెప్పారు. కొందరు స్నేహితుల కోసం మోదీ రాష్ట్రాల మెడలపై కత్తులు పెట్టి విదేశాల నుంచి బొగ్గు కొనిపిస్తున్నారని అన్నారు. దేశంలో దమ్మున్న ప్రధాని ఉంటే 24 గంటల విద్యుత్ ఎందుకు సాధ్యం కాదని నిలదీశారు.

  • 12 Feb 2023 04:19 PM (IST)

    ప్రపంచ యుద్ధాల సమయంలోనూ జనాభా గణన ఆగలేదు

    రెండు ప్రపంచ యుద్ధాల సమయంలోనూ జనాభా గణన ఆగలేదని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ, ఇప్పుడు మాత్రం ఆపారని విమర్శించారు. జనాభా లెక్కలు జరిగితే బండారం బయట పడుతుందని కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. జనాభా గణన చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీలు అడుగుతున్నారని చెప్పారు. తాను గతంలో మోదీని నమ్మి నోట్ల రద్దును సమర్థించానని, దేశాన్ని బాగుచేయలేని విశ్వగురువులెందుకని విమర్శించారు.

  • 12 Feb 2023 03:48 PM (IST)

    అప్పులు చేయడంలో మోదీని మించిన వారు లేరు..

    అప్పులు చేయడంలో మోదీని మించిన వారు లేరని కేసీఆర్ విమర్శించారు. దేశాన్ని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టారని అన్నారు. మన్మోహన్ హయాంలో ద్రవ్యలోటు 4.77 శాతంగా ఉంటే, మోదీ పాలనలో అది 5.1 శాతానికి చేరిందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో అధికారం ప్రజల దయ అని కేసీఆర్ అన్నారు. అధికారం ఉందని అహంకాం ప్రదర్శించకూడదని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

  • 12 Feb 2023 03:40 PM (IST)

    మోదీ వివరణ ఇవ్వాల్సిందే

    అదానీ వ్యవహారంపై మోదీ వివరణ ఇవ్వాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హిండెన్ బర్గ్ లేవనెత్తిన అంశాలపై మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఢిల్లీలో తాము ప్రశ్నిస్తున్నామని తెలిపారు. అదానీ తెలంగాణలోనూ సంస్థను నెలకొల్పుతామని అన్నారని, చివరకు ఆయన పెట్టలేదరని మనం బతికి పోయామని ఎద్దేవా చేశారు. అదానీ వ్యవహారంపై దేశం మొత్తం నిలదీస్తుంటే ప్రధాని మోదీకి ఆక్రోశం పొడుచుకొస్తోందని అన్నారు. లోక్ సభలో అదానీ వ్యవహారం గురించి మాట్లాడకుండా మోదీ ఇతర విషయాలు మాట్లాడారని అన్నారు.

  • 12 Feb 2023 03:18 PM (IST)

    మోదీ హయాంలో కంటే.. మన్మోహన్ హయాంలోనే బెటర్..

    కేంద్రంపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. 2014లో కాంగ్రెస్ ను గద్దెదించి బీజేపీని అధికారంలోకి తెచ్చుకోవటం వల్ల పెనంపైనుంచి పొయ్యిలో పడినట్లు ప్రజల పరిస్థితి మారిందని అన్నారు. బీజేపీ విధానాల వల్ల దేశంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, భారత్ పౌరసత్వం వదులుకొనేవారి సంఖ్య ఎక్కువైందని అన్నారు. నిజానికి చెప్పాలంటే మోదీ హయాంలో కంటే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే దేశం అభివృద్ధి జరిగిందని అన్నారు. ఈ విషయం నేను చెప్పింది కాదని, పూజా మెహ్రా అనే జర్నలిస్ట్ ఓ పుస్తంక రాసిందని, దానిలో పది సంవత్సరాలు మన్మోహన్ పరిపాలన, మోదీ పాలనపై పూర్తి వివరాలు ఉన్నాయని కేసీఆర్ అన్నారు.

  • 12 Feb 2023 03:09 PM (IST)

    ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన విషయం అందరికీ తెలిసిందే. విభజన సమయంలో తెలంగాణకు రావాల్సిన రూ. 495కోట్లు తెలంగాణ కు రాష్ట్రంకు రావాల్సినవి ఏపీ ఖాతాలో వేశారని, మావి మాకు ఇవ్వాలని ఏడేళ్లుగా అడుగుతున్నా కేంద్రం పట్టించుకోవటం లేదని కేసీఆర్ అన్నారు.

  • 12 Feb 2023 03:04 PM (IST)

    కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, బడ్జెట్ చదివిన విజ్ఞులందరికీ ఆ విషయం తెలుసని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణ రాష్ట్రంకు ఒక్కటి రాలేదని అన్నారు. నర్సింగ్ కాలేజీల్లోనూ ఒక్కటికూడా కేటాయించలేదని అన్నారు.

  • 12 Feb 2023 03:02 PM (IST)

    శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతున్నారు.

  • 12 Feb 2023 01:22 PM (IST)

    హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమం ద్వారా అడవుల లోపల, వెలుపల పెద్ద ఎత్తున మొక్కలు పెంచాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇందులో భాగంగా 2022-23లో 19.29 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, 2023-2024లో 20.02 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని వెల్లడించారు. మొక్కల పెంపక కార్యక్రమాలు చేపట్టడానికి గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు బడ్జెట్‌లో 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌గా కేటాయించామన్నారు. మొక్కల పెంపకం సక్రమంగా పర్యవేక్షణ జరిగేలా చూడటానికి జియో ట్యాగింగ్‌ ఆఫ్‌ ప్లాంటేషన్స్‌ను చేపట్టామని తెలిపారు.

  • 12 Feb 2023 01:19 PM (IST)

    పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల పచ్చదనం పెరిగిందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. 2015 నుంచి 2021 సంవ‌త్సరాల మ‌ధ్య పచ్చదనం (గ్రీన్ కవర్) శాతం 7.70 శాతం పెరిగినట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ( ఐఎఫ్ఎస్ఆర్) ప్రకటించిందని తెలిపారు. పచ్చదనం పెరగడంపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా హరితహార కార్యక్రమం, పచ్చదనం పెంపుకు తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సమాధానం ఇచ్చారు.

  • 12 Feb 2023 12:48 PM (IST)

    రాష్ట్రంలో పంట రుణమాఫీపై సభ్యులు అడిగి ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. 2014 పంట రుణమాఫీ పథకం కింద 31,31,913 మంది రైతులకు మొత్తం రూ. 16,144 కోట్లు రుణ మాఫీ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. 2018 పంట రుణమాఫీ పథకం కింద నేటికి 5,42,069 మంది రైతుల పంట రుణాలు మాఫీ చేయడం జరిగిందని మంత్రి అన్నారు. పథకంలో భాగంగా 21,556.64 కోట్లు అంచనా వేయడం జరిగిందని చెప్పారు. మొదటి దశలో రూ. 25వేలలోపు రుణం ఉన్న రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని, రూ.50వేల రుణమాఫీ పురోగతిలో ఉందని మంత్రి తెలిపారు.

  • 12 Feb 2023 12:38 PM (IST)

    కొల్లాపూర్ మామిడి పండ్ల మార్కెట్‌కు త్వరలోనే టెండర్లు పిలుస్తాం - మంత్రి నిరంజన్ రెడ్డి

    తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఉద్యానవన పంటల్లో మామిడి ముఖ్యమైనదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ లో మామిడి పండ్ల మార్కెట్ నిర్మాణ విషయంపై స్థానిక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. కొల్లాపూర్‌లో మామిడి పండ్ల మార్కెట్ నిర్మాణం చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని, ఇందుకోసం రూ. 5కోట్ల45లక్షల వ్యయంతో ఈ మార్కెట్ నిర్మాణం చేయటం జరుగుతుందని మంత్రి తెలిపారు. త్వరలో టెండర్లు పిలుస్తామని అన్నారు. అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు అసంపూర్తిగా ఉన్న మార్కెట్‌ను పూర్తిచేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచిస్తానని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

  • 12 Feb 2023 12:28 PM (IST)

    హైదరాబాద్‌లో జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవని సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో ఆరేడు మార్కెట్లు మాత్రమే ఉండేవని, శాస్త్రీయ దృక్పథం లేకుండా మార్కెట్లు నిర్మించారని అన్నారు. నిజాం హయాంలో కట్టిన మోండా మార్కెట్‌ని చూసి ఆశ్చర్య పోయానని అన్నారు. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో సరిపడా వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లు లేవన్నారు. హైదరాబాద్‌ మార్కెట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించామని వెల్లడించారు. కనీసం 2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పారు.

  • 12 Feb 2023 12:22 PM (IST)

    ప్రతి నియోజకవర్గంలో అధునాత మార్కెట్లు.. సీఎం కేసీఆర్‌

    అధునాతన కూరగాయల మార్కెట్లు ప్రతి నియోజకవర్గంలో తేవాలనే ఆలోచనలో ఉన్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీలో  ప్రశ్నోత్తరాల సమయంలో కేసీఆర్ మాట్లాడారు.. గతంలో చాలా కూరగాయల మార్కెట్లు అనుకున్నంత పరిశుభ్రంగా లేవని, మురికిలో, మట్టి, దుమ్ములో కూరగాయలు అమ్మే పరిస్థితి ఉండేదని చెప్పారు. ఈ నేపథ్యంలో సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లకు శ్రీకారం చుట్టామని సీఎం వెల్లడించారు. హైదరాబాద్‌లోని నిజాం హయాంలో కట్టిన మోండా మార్కెట్‌ని చూసి ఆశ్చర్యపోయానని, శాస్త్రీయతకు అనుగుణంగా ఆమార్కెట్ నిర్మాణం అప్పట్లో చేపట్టారని, ఇప్పటికీ అది అద్భుతంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. మోండా మార్కెట్‌ని కలెక్టర్లందరికీ చూపించామని, అలాంటి మార్కెట్లు అన్ని జిల్లాల్లో నిర్మించాలని సూచించామన్నారు. ఇప్పటికే నారాయణపేట, ఖమ్మం నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మార్కెట్‌లను ఎంతో చక్కగా నిర్మించారని కేసీఆర్ అభినందించారు.

  • 12 Feb 2023 12:13 PM (IST)

    కల్తీ విత్తనాల బెడద లేకుండా చూస్తాం ..

    రాష్ట్రంలో కల్తీ విత్తనాల బెడదను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తెలిపారు. కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ కేసులు పెడుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లో వారిని ఉపేక్షించబోమని కేసీఆర్ స్పష్టం చేశారు.

  • 12 Feb 2023 11:59 AM (IST)

    ఆ విషయంపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఎందుకు ప్రశ్నించరు..? మంత్రి ఎర్రబెల్లి

    ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఉపాధిహామీపై భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలోనే ఈజీఎస్ పథకాన్ని తీసుకొచ్చారని, కానీ బీజేపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని నీరుగార్చేందుకు కుట్ర చేస్తున్నా.. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఎందుకు నోరు మెదపడం లేదని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ గ్రామాల్లో మనం తీర్మానాల ప్రకారం చేసుకోవాలని మంత్రి తెలిపారు. ఆ మెటీరియల్ కాంపోనెంట్ రూ. 1150 కోట్లు కేంద్రం నుంచి రావాలని, తొమ్మిది నెలల నుంచి కేంద్రం ఆ నిధులు ఆపుతుందని మంత్రి తెలిపారు. గ్రామ సర్పంచ్‌లు అంతా అవస్థపడేది మెటీరియల్ కాంపోనెంట్ కింద చేసిన వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, సీసీ రోడ్లు.. ఇత పనులు నిధులు రాకపోవటం వల్లనేనని, అవి కేంద్రం నుంచి రావాలని అన్నారు. ఉపాధి హామీ పథకంను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, పశ్చిమ బెంగాల్‌లో ఎత్తేసిందని, ఇక్కడ ఎత్తేయాలని ప్లాన్ చేస్తుందని అన్నారు. ఉపాధి స్కీం కాంగ్రెస్ హయాంలో వచ్చిందని, కాంగ్రెస్ వాళ్లు ఢిల్లీలో ఎందుకు లొల్లి పెట్టరని, ఇక్కడ మాట్లాడితే ఉపయోగం ఉండదని ఎర్రబెల్లి అన్నారు.

  • 12 Feb 2023 11:41 AM (IST)

    ఈ నెలలో ఆశ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం .. మంత్రి హరీష్ రావు

    జీహెచ్ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టులకు ఈ నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడారు. బస్తీ దవాఖానాల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని అన్నారు. పేదల సౌకర్యం కోసం బస్తీ దవాఖానల పని దినాల్లో మార్పు చేస్తామన్నారు.  బస్తీ దవాఖానాల్లో మార్చి నెలాఖరు నాటికి 134 రకాల పరీక్షలు నిర్వహిస్తామని హరీష్ రావు తెలిపారు. 158 రకాల మందులు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఏప్రిల్‌లో అన్ని జిల్లాల్లో న్యూటిషన్‌ కిట్లు పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే మేడ్చల్‌ జిల్లాకు మెడికల్‌ కాలేజీ మంజూరు చేస్తామని హరీష్ రావు తెలిపారు.

  • 12 Feb 2023 11:22 AM (IST)

    భట్టి వ్యాఖ్యలకు మంత్రుల ఘాటు రియాక్షన్ ..

    అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గాంధీ ఆస్పత్రిలో తేదీ అయిపోయిన డ్రగ్స్ మందులు ఇస్తున్నారని, పేషెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయని, ఆరోగ్య శాఖ మంత్రి ప్రభుత్వ ఆస్పత్రులను రెగ్యూలర్ గా విజిట్ చేయాలని, దీంతో ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది నిబద్దతతో పనిచేసే అవకాశం ఉంటుందని భట్టి కోరారు. మెడిసిన్ ఇచ్చే సమయంలో తేదీ అయిపోయినవి ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భట్టిసూచించారు. మంత్రి అజయ్ కుమార్ కల్పించుకొని మాట్లాడుతూ.. ఆరోగ్యశాఖ మంత్రిగా హరీష్ రావు బాధ్యతలు తీసుకున్న తరువాత నిత్యం రాష్ట్రంలో పర్యటిస్తూ అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆస్పత్రులను విజిట్ చేస్తున్నారని అన్నారు. మధిరలో వంద పడకల ఆస్పత్రికి శిలాఫలకం వేసింది హరీష్ రావేనని భట్టి గుర్తు చేసుకోవాలని సూచించారు. వెంటనే మంత్రి ప్రశాంత్ రెడ్డి కల్పించుకొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో మంత్రులు ఆస్పత్రులను సందర్శించిన దాఖలాలు తక్కువ అని, నేడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తిరుగుతూ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రిలో సైతం డబ్బులు లేనిది ఎప్పుడూ వైద్యం అందలేదని, తెలంగాణ హయాంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని అన్నారు.