Gandhi Bhavan
Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మొదటి విడత జాబితా విడుదలైంది. రెండో విడత జాబితాపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. మరో రెండుమూడు రోజుల్లో రెండో విడత జాబితాను వెల్లడించేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమవుతోంది. అయితే, మొదటి విడత జాబితాలో టికెట్లు దక్కని నేతలు కొందరు పార్టీకి రాజీనామా చేయగా.. మరికొందరు పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు నేతలు బహిరంగంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అధిష్టానంపై, ముఖ్య నేతలపై విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యవహారాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్ పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు.
Also Read : Jagga Reddy : ఎన్ని కుట్రలు చేసినా నేనే సీఎం : ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రెండో విడత అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏఐసీసీ సెక్రటరీ మన్సూర్ అలీఖాన్ టికెట్ల కేటాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ల కేటాయింపు వ్యవహారం ఇంకా ముగియలేదని, ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. టికెట్ల కేటాయింపు విషయంలో నాయకులు పార్టీకి వ్యతిరేకంగా కానీ, నాయకులకు వ్యతిరేకంగా కానీ బహిరంగంగా మాట్లాడొద్దని హెచ్చరించారు. టికెట్లు ఆశించిన నేతలు పత్రిక సమావేశాలు, ప్రకటనలుఇస్తూ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని సూచించారు.పార్టీ టికెట్ల కేటాయింపుల విషయంలో కొందరు నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారని, ప్రకటనలు చేస్తున్నారని, అలా చేయడం పార్టీ విధానాలకు వ్యతిరేకమని, అలా చేయకూడదని కాంగ్రెస్ పార్టీ నేతలకు మన్సూర్ అలీఖాన్ సూచించారు. ఎలాంటి సమస్యలున్నా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురావాలి తప్ప బహిరంగంగా మాట్లాడొద్దని అలీఖాన్ పార్టీ నేతలను ఆదేశించారు.