Local Body Elections: తరుముకొస్తున్న హైకోర్ట్ డెడ్ లైన్.. లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు? సస్పెన్స్ వీడేనా..
తెలంగాణలో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ ఛైర్మన్, కౌన్సిలర్, మున్సిపల్ ఛైర్మన్ల పదవీ కాలం ముగిసి 18 నెలలు..(Local Body Elections)

Local Body Elections: తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు పెట్టిన గడువు సమీపిస్తోంది.
సెప్టెంబర్ 30లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు పెట్టగా, అంతకంటే ముందు బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది.
అయితే ఇప్పటివరకు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపలేదు.
అంతేకాదు దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్న నమ్మకం కూడా కనిపించటం లేదు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని పట్టుదలగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. దీని కోసం అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నారు.
ఢిల్లీ వేదికగా ఆఖరి పోరాటం కూడా పూర్తి..
పంచాయతీ రాజ్ సవరణ కోరుతూ ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదానికి పంపించారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడంతో రాష్ట్రపతికి పంపించారు.
బీసీ బిల్లు రాష్ట్రపతి భవన్ లో నాలుగు నెలలుగా మూలుగుతోంది.
దీనిపై ఢిల్లీ వేదికగా ఆఖరి పోరాటం కూడా పూర్తి చేశారు. జంతర్ మంతర్ దగ్గర ఇండియా కూటమి ఎంపీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ధర్నా చేశారు. బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణలో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ ఛైర్మన్, కౌన్సిలర్, మున్సిపల్ ఛైర్మన్ల పదవీ కాలం ముగిసి 18 నెలలు దాటింది. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. (Local Body Elections)
నిలిచిపోయిన దాదాపు రూ.1500కోట్ల నిధులు..
దీంతో కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులు నిలిచిపోయాయి. ఎన్నికలు జరక్కపోవటంతో కేంద్రం నుంచి దాదాపు 1500 కోట్ల నిధులు రాష్ట్రానికి రాకుండా పోయాయి.
ఏది ఏమైనా పార్టీ పరంగా 42శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీని కార్యాచరణకు పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
పార్టీ పీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునేలా సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. ఆ సమావేశంలో చర్చించిన తర్వాత లోకల్ పోరుకు రూట్ మ్యాప్ వేయనున్నట్లుగా సమాచారం. (Local Body Elections)
Also Read: వేటు తప్పదా..! రాజగోపాల్ రెడ్డిపై మల్లు రవి హాట్ కామెంట్స్.. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే..