బెంగళూరు-హైదరాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్.. కేవలం 2 గంటల్లో ప్రయాణం.. ఫుల్ డీటెయిల్స్..
మొత్తం ప్రాజెక్టు పొడవు 626 కిలోమీటర్లు. రైల్వే కన్సల్టెన్సీ సంస్థ రైట్స్ లిమిటెడ్ సర్వే నిర్వహిస్తోంది.

Bullet Train
Bullet Train project: బెంగళూరు-హైదరాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు మళ్లీ ముందుకు సాగనుంది. అధికారులు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను సిద్ధం చేస్తున్నారు. దీన్ని 2026 మార్చిలో సమర్పించనున్నారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ రెండు నగరాల మధ్య ప్రజల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బెంగళూరు నుంచి హైదరాబాద్ దూరం కవర్ చేయడానికి 19 గంటలు పడుతోంది. ఇది ఏకంగా 2 గంటలకు తగ్గనుంది.
దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) ప్రతిపాదిత హైదరాబాద్-బెంగళూరు హై స్పీడ్ రైలు కారిడార్ తుది సర్వే, సరిహద్దు పనులు ప్రారంభించింది. మొత్తం ప్రాజెక్టు పొడవు 626 కిలోమీటర్లు. రైల్వే కన్సల్టెన్సీ సంస్థ రైట్స్ లిమిటెడ్ సర్వే నిర్వహిస్తోంది.
ఈ సర్వే పూర్తయిన వెంటనే ఎస్‌సీఆర్ డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేసి రైల్వే బోర్డుకు సమర్పిస్తుంది. అనంతరం రైల్వే బోర్డు దానిని కేంద్ర కేబినెట్‌కు పంపుతుంది. కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఆమోదించిన తర్వాత నిర్మాణ టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
Also Read: లండన్‌లో లక్షలాది మంది నిరసనలు.. ఇప్పటివరకు ఏం జరిగింది? వారి వెనకున్న టామీ రాబిన్‌సన్ ఎవరు?
ఇలాగైతే మాత్రం ఆలస్యం!
ప్రాజెక్టు కోసం అధికారులు భూమిని స్వాధీన చేసుకునే ప్రక్రియే ప్రధాన సవాలు అని తెలుస్తోంది. ఎస్‌సీఆర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ. శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాల సంపూర్ణ సహకారం అవసరం అన్నారు. (Bullet Train project)
“సర్వే బృందాలు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఉదాహరణకు కర్ణాటకలో కొన్ని సమావేశాలు ఇప్పటికే జరిగాయి” అని చెప్పారు. ఏదైనా ప్రాంతంలో భూమి సమస్యలు ఎదురైతే రైలు మార్గాన్ని మార్చుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు కీలకం కానున్నాయి.
ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి ప్రోత్సాహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై హై స్పీడ్ కారిడార్ పనులను వేగవంతం చేయాలని రైల్వే అధికారులను ఇప్పటికే కోరారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్షిణ భారత ప్రధాన నగరాలను కలిపే హై స్పీడ్ రైలు నెట్‌వర్క్ త్వరలో ప్రారంభమవుతుందని అన్నారు.
వేగం, సాంకేతిక వివరాలు
ఇప్పటికే నిర్మాణంలో ఉన్న అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టులాగే ఈ రైల్వే లైన్ గరిష్ఠ వేగం 350 కి.మీ./గంటగా రూపొందించనున్నారు. రైళ్లు సగటు ఆపరేషనల్ వేగం 320 కి.మీ./గంట వద్ద నడుస్తాయి.