Telangana : వ్యవసాయ కూలీల పిల్లలకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి వాళ్లకు 15శాతం రిజర్వేషన్.. అందుకు అర్హతలు ఇవే..
తెలంగాణ రాష్ట్రం (Telangana Govt) లోని వ్యవసాయ కూలీల పిల్లలకు గుడ్‌న్యూస్. వారికి ఇక నుంచి 15శాతం రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి.

Telangana Govt
Telangana Govt : తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ కూలీల పిల్లలకు గుడ్‌న్యూస్. వారికి ఇక నుంచి ఆ కోర్సుల్లో 15శాతం రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా తొలిసారిగా వ్యవసాయ కూలీల పిల్లల కోసం బీఎస్సీ (అగ్రికల్చర్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో 15శాతం సీట్లను ప్రత్యేక కోటాగా కేటాయించామని రిజిస్ట్రార్ విద్యాసాగర్ వెల్లడించారు.
Also Read: Prof Kodandaram: జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూస్తున్నారా? కీలక వివరాలు తెలిపిన ప్రొ.కోదండరామ్
ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ, హార్టికల్చర్, వెటర్నరీ యూనివర్సిటీల పరిధిలోని వ్యవసాయ, అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకోసం ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు ఫస్ట్ ఫేజ్ జాయింట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని విద్యాసాగర్ తెలిపారు. రాజేంద్రనగర్ లోని అగ్రికల్చర్ వర్సిటీ ఆడిటోరియంలో ఆ తేదీల్లో ఉదయం 9.30గంటలకు కౌన్సెలింగ్ జరగనుందని చెప్పారు.
అర్హతలు ఇవే..
♦ నాల్గో తరగతి నుంచి 12వ తరగతి వరకు కనీసం నాలుగేళ్లు ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు లేదా రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివిన విద్యార్థులు ఈ కోటాకు అర్హులు.
♦ విద్యార్థి లేదా వారి తల్లిదండ్రుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డు ఉండాలి.
♦ విద్యార్థి, వారి తల్లిదండ్రులు లేదా తాతల పేరిట ఎలాంటి వ్యవసాయ భూమి ఉండకూడదు. అయితే, ఒక ఎకరం భూమి ఉన్నవారు పైన పేర్కొన్న అర్హతలు కలిగి ఉంటే ఈ కోటాకు అర్హులు.
♦ కౌన్సెలింగ్ కు హాజరయ్యే విద్యార్థులు అర్హతలకు సంబంధించి అన్ని సర్టిఫికెట్లు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి.
♦ బీఎస్సీ (అగ్రికల్చర్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల మొదటి సెమిస్టర్ ఫీజు రూ.49,560గా నిర్ణయించామని రిజిస్ట్రార్ విద్యాసాగర్ తెలిపారు.
♦ పూర్తి వివరాలకోసం విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.pjtsau.edu.in లో చూడొచ్చు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ప్రతీయేటా రూ.12వేల సాయం అందించడాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయా కుటుంబాల వారికి దేశంలోనే తొలిసారిగా అగ్రికల్చర్ డిగ్రీ కోర్సుల ప్రవేశాల్లో 15శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు యూనివర్సిటీ ముందుకొచ్చినట్లు తెలిపారు.
దేశంలోనే తొలిసారిగా 1986లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో అగ్రికల్చర్ యూనివర్సిటీలో రైతు కుటుంబాల విద్యార్థులకు 25శాతం రిజర్వేషన్ విధానం మొదలైంది. దానిని 2009 సంవత్సరంలో 40శాతానికి అధికారులు పెంచారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ఆ విధానం అమల్లో ఉంది.
అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం పరిధిలోని కాలేజీల్లో యేటా 670 సీట్లు భర్తీ అవుతున్నాయి. అందులో రైతన్నలకు చెందిన కుటుంబాల పిల్లలు 40శాతం కోటా కింద 268 సీట్లు పొందుతున్నారు. ఈ అకాడమిక్ ఇయర్ లో 15శాతం కోటా కింద భూమిలేని వ్యవసాయ కూలీల పిల్లలకు 100 వరకు సీట్లు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. మిగిలిన 25శాతం కింద రైతు కుటుంబాలకు 168 సీట్లు లభించనున్నాయి. వ్యవసాయ కూలీల కుటుంబాల నుంచి విద్యార్థులు ఈ కోర్సుల్లో తమ కోటాను పూర్తిచేయలేని పక్షంలో ఈ సీట్లుసైతం రైతు కుటుంబాల వారే పొందేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తుంది.