CM KCR : 4 రోజుల్లో 7 బహిరంగ సభలు.. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం కేసీఆర్

మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు కేసీఆర్. పొరపాటున ఆ పార్టీలకు ఓట్లు వేస్తే ఉన్న పథకాలన్నీ అటకెక్కుతాయని వార్నింగ్ ఇచ్చారు. CM KCR

CM KCR Election Campaign

CM KCR Election Campaign : ప్రాసలు, సూక్తులు, చలోక్తులు, సామెతలు, సాధక బాధకాలు.. ఇలా ఒక్కోచోట ఒక్కో రకంగా సాగుతున్నాయి తెలంగాణ సీఎం కేసీఆర్ బహిరంగ సభలు. నాలుగు రోజులు ఏడు నియోజకవర్గాల్లో పర్యటించిన కేసీఆర్.. బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధిని వివరిస్తూనే కాంగ్రెస్, బీజేపీల వైఖరిని ఎండగడుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణ రాక ముందు పరిస్థితులను గుర్తు చేస్తూ, విపక్షాలు అధికారంలోకి వస్తే జరిగే నష్టాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు గులాబీ బాస్.

కేసీఆర్ దూకుడు.. గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రోజుకు రెండు సభలు చొప్పున నిర్వహిస్తూ గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతున్నారు. అక్టోబర్ 15న మేనిఫెస్టో ప్రకటన తర్వాత హుస్నాబాద్ నుంచి ప్రారంభమైన కేసీఆర్ ఎన్నికల ప్రచారం బుధవారం జడ్చర్ల, మేడ్చల్ నియోజకవర్గాల్లో కొనసాగింది.

Also Read : కవితకు ఆ ఇద్దరి బాధ్యతలే ఎందుకు అప్పగించారు.. ఆ ఇద్దరు నేతలు ఎవరు?

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లతో పాటు మేడ్చల్ నియోజకవర్గంలో జరిగిన సభల్లో కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. కరవుతో అల్లాడుతున్న పాలమూరు జిల్లాను ప్రాజెక్టులతో సస్యశ్యామలం చేస్తుంటే ఇక్కడి కాంగ్రెస్ నాయకులతో పాటు పక్క రాష్ట్రాల సీఎంలకు కడుపులో మండుతోందన్నారు. కృష్ణా జలాల్లో మనకు హక్కుగా వచ్చే వాటా ఇవ్వకపోగా, శ్రీశైలం నీటిని మొత్తం వాడుకోవడానికి వాళ్లకి ఏం హక్కు ఉందని ప్రశ్నించారు కేసీఆర్.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నాం అన్నారు సీఎం కేసీఆర్. ఎన్నో విషయాల్లో మన రాష్ట్రం దేశానికి దారిచూపే దీపంలా మారిందన్న ఆయన 60ఏళ్లు ఎవరి వల్ల ఘోస పడ్డామో గుర్తించాలన్నారు. మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు కేసీఆర్.

ఆ పార్టీలకు ఓట్లు వేస్తే ఖతమే..
అధికారం ఇవ్వమని అడుగుతున్న బీజేపీ, కాంగ్రెస్ లు.. తెలంగాణ మాదిరిగా 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాయని ప్రశ్నించారు. ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో కరెంట్ కోసం రైతులు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారన్న ఆయన.. కర్నాటకలో 20 గంటలు కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు చేతులెత్తేసిందన్నారు. పొరపాటున ఆ పార్టీలకు ఓట్లు వేస్తే ఉన్న పథకాలన్నీ అటకెక్కుతాయన్న గులాబీ బాస్.. బీఆర్ఎస్ ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు.

Also Read : కేసీఆర్ రాకతో షబ్బీర్ అలీ వెనకడుగు.. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆయనేనా?

ఓవైపు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని వివరిస్తూనే కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడుతున్నారు సీఎం కేసీఆర్. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే దేశంలోనే నెంబర్ 1గా ఉన్న రాష్ట్రం మళ్లీ వెనకబడిపోతుందని హెచ్చరించారు గులాబీ బాస్.

ట్రెండింగ్ వార్తలు